బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా ఆదివారం జరిగిన మహిళల టీ-20 క్రికెట్ పోటీలో దాయాది పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. గ్రూప్ ఏలోని ఈ రెండు జట్లు తమతమ తొలి పోటీల్లో ఓటమి పాలవడంతో రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిన పరిస్థితుల్లో బరిలోకి దిగారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 99 పరుగులకే ఆలౌట్ కాగా భారత్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 11.4 ఓవర్లలో 102 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 100 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత క్రీడాకారులు షఫాలీ వర్మ, మంధానా బరిలోకి దిగి ధాటీగా ఆడటం మొదలుపెట్టారు. తొలి ఐదు ఓవర్లలో ఇద్దరూ కలసి సిక్సులు, ఫోర్లతో 52 పరుగులు రాబట్టారు. ఆరో ఓవర్లో టుబా హుస్సేన్ ధాటీగా ఆడుతున్న షఫాలీ వర్మను ఔట్ చేసింది. 9 బంతుల్లో సిక్స్, 2 ఫోర్లతో చెలరేగి ఆడుతున్న సమయంలో ఔటైంది. ఆ తరువాత మేఘన సుబ్బినేని బరిలోకి రాగా మంధాన ధాటీగా ఆడుతూ వచ్చింది. 10 ఓవర్లలో భారత్ ఒక వికెట్ కోల్పోయి పరుగులు చేసింది. ఆ తరువాత 11 ఓవర్‌లో ఒమైమా సొహైల్ బౌలింగ్‌లో మేఘన ఔట్ కాగా జెమీమా రోడ్రిగ్స్ బరిలోకి దిగింది. 12 ఓవర్‌లో మంధానా, రోడ్రిగ్స్ భారత్‌ను విజయ తీరానికి చేర్చారు. స్మృతి మంధానా 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63 పరుగులు చేయగా, రాధాయాదవ్, స్నేహ్ రాణా చెరి రెండు వికెట్లు, రేణుకాసింగ్, మేఘన, షఫాలీ వర్మ తలో వికెట్ పడగొట్టారు.
పేకమేడలా కూలిన పాక్ బ్యాటింగ్ లైనప్ అంతకుముందు పాకిస్తాన్ కెప్టెన్ బిస్మామరూఫ్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మునీబాఅలీ, ఇరామా జావేద్ ఓపెనర్లుగా ఆట ప్రారంభించగా భారత బౌలర్ రేణుకాసింగ్ బౌలింగ్‌కు తొలి ఓవర్‌లో పరుగులేమీ ఇవ్వలేదు. మేఘనా సింగ్ రెండో ఓవర్‌లో రెండో బంతికి ఇరామ్ జావెద్ ఔటవడంతో పాక్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత బరిలోకి వచ్చిన మరూఫ్ నెమ్మదిగా స్కోరు పెంచుతూ వచ్చారు. తొలి ఐదు ఓవర్లలో పాకిస్తాన్ ఒక వికెట్ కోల్పోయి 26 పరుగులు చేయగలిగింది. 9 ఓవర్లో స్నేహ్ రాణా రెండు వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ ఇక తేరుకోలేకపోయింది. మరూఫ్, మునీబా వికెట్లను ఆమె పడగొట్టారు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది.11 ఓవర్‌లో రేణుకా సింగ్ బౌలింగ్‌లో ఆయేషా నసీమ్ ఔట్ కాగా, 15 ఓవర్లో షఫాలీ వర్మ బౌలింగ్ చేయగా సొహెయిల్ రనౌట్ కాగా 17ఓవర్లో అలియా రియాజ్‌ను వర్మ ఔట్ చేసింది. ఇక 18 ఓవర్‌ను రాధాయాదవ్ బౌల్ చేయగా దియానా బేగ్ స్టంప్ ఔట్ కాగా, అదే ఓవర్‌లో టూబా రనౌట్, ఇంతియాజ్ బౌల్డ్ అయ్యారు. మొత్తంమీద 18 ఓవర్లలో పాకిస్తాన్ మహిళల జట్టు 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ జట్టులో మునీబ్ 32 పరుగులు చేయగా మిగతావారంతా తక్కువ స్కోరుకే ఔటయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.