న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భారత్ మహిళల జట్టు విజయం సాధించింది. ఈరోజు జరిగిన ఆఖరి-నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
కివీస్ నిర్ధేశించిన 233 పరుగుల ఛేధనలో భారత జట్టు దుమ్మురేపింది. ఓపెనర్ స్మృతి మంధాన (100) శతకంతో విజృంబించగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (59 నాటౌట్) హాఫ్ సెంచరీతో చెలరేగింది. యాస్టికా భాటియా (35), జెమిమా రోడ్రిగ్స్ (22) రాణించారు. దీంతో భారత జట్టు 44.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 236 పరుగులు సాధించి కివీస్ ను చిత్తుగా ఓడించింది.
కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాలింగ్ చేసిన కివీస్.. 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బ్రూక్ హాలిడే (86) అర్థశతకంతో ఆకట్టుకుంది. జార్జియా ప్లిమ్మర్ (39), ఇసాబెల్లా గాజ్ (25), లీ తహుహు (24నాటౌట్) పరువాలేదనిపించారు. మిగిలిన వారు స్వల్ప పరుగులకే పెవిలియన్ కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు, ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీయగా… రేణుకా సింగ్, సైమా ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు.