సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియ మరో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. దాదాపు ఆరు నెలల క్రితం చివరిసారి ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడిన భారత్.. ఇప్పుడు సొంతగడ్డపై పసికూన బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందకు రెడీ అయింది. చెన్నైలోని చెపాక్ క్రికెట్ స్టేడియం వేదికగా నేటి (గురువారం) నుంచి భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇరుజట్లు తమ సన్నాహకాలు, వ్యూహాలు పూర్తి చేసుకుని విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఓవైపు దాదాపు కొన్నేళ్లుగా సొంతగడ్డపై ఓటమే ఎరుగుని పటిష్టమైన టీమిండియా ఉంటే.. మరోవైపు ఇటీవల పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై చిత్తుగా ఓడించి 2-0తో సిరీస్‌ను చారిత్రకంగా క్లీన్ స్వీప్ చేసుకున్న బంగ్లాదేశ్ ఉన్నది.
అందుకే ఇప్పుడు భారత్-బంగ్లా సిరీస్‌పై అందరి ఆసక్తి పెరిగింది. కాగా, 2012 నుంచి భారత్ సొంతగడ్డపై వరుసగా 17 టెస్టు సిరీస్‌లు గెలిచి అజేయంగా నిలిచింది. అయితే టీమిండియాను ఓడించాలని కలను కంటున్న బంగ్లాకు గట్టి జవాబు ఇచ్చేందుకు రోహిత్ సేన పూర్తిగా సిద్ధంగా ఉంది.
ఈ సిరీస్ కోసం బీసీసీఐ 16 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. అందులో కొద్దికాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఈ సిరీస్‌తో మళ్లి రీఎంట్రీ చేస్తున్నారు. వీరి రాకతో టీమిండియా మరింతా పటిష్టంగా మారింది.
వీరితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ టీమిండియా బ్యాటింగ్ బలాన్ని రెట్టింపు చేయనున్నారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దిప్ యాదవ్, అక్షర్ పటేల్‌లతో కూడిన విధ్వంసకర బౌలింగ్ దళం టీమిండియాకు సొంతం. వీరు ఏలాంటి బ్యాటింగ్ లైనప్‌లున్నా వారిని ఇట్టే చిత్తు చేయగలరు.
వీరితో పాటు ఈసారి జట్టుకు ఎంపికైన యువ ఆటగాళ్లు ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ దయాల్, ఆకాశ్ దీప్ కూడా అవకాశం కోసం ఆతృతగా ఉన్నారు. కానీ మేనేజ్‌మెంట్ మాత్రం సీనియర్లకే మొగ్గు చూపుతుండటంతో యువ ఆటగాళ్లు బెంచ్‌కే పరిమితం కానున్నారు. ఇక చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకులించే అవకాశాలు ఉండటంతో ఈసారి ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది. పేస్ విభాగాన్ని బుమ్రా, సిరాజ్‌తో సరిపెట్టనున్నారు.
జోరుమీదున్న బంగా..
ఇటీవలే పాకిస్తాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్ ఫుల్ జోష్‌తో భారత్‌లో అడుగుపెట్టింది. టీమిండియాకు కఠిన సవాల్ విసిరేందుకు బంగ్లా టైగర్లు రెడీ అయ్యారు. ఈ జట్టులోనూ స్టార్ ఆటగాళ్లకు కొదువలేదు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటోతో పాటు అనుభావాజ్ఞులైన సీనియర్ ఆటగాళ్లు షకీబుల్ హసన్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్ వాంటి స్టార్ ఆటగాళ్లు బంగ్లాకు సొంతం.
వారితో పాటు మొమినుల్ ఇస్లాం, తైజుల్ ఇస్లాం, తస్కీన్ అహ్మద్, మెహదీ హసన్ మీరాజ్ కూడా మ్యాచ్ విన్నర్లే. వీరిందరి కలిసి కట్టుగా రాణిస్తే టీమిండియాకు కష్టాలు తప్పవని చెప్పాలి. మొత్తంగా భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతో బంగ్లా ఈ చెన్నై మ్యాచ్‌కు సిద్ధమైంది. మరోవైపు రోహిత్ సేన కూడా బంగ్లాను ఓడించి డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో తమ అగ్రస్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవాలని చూస్తోంది.
భారత్‌దే పూర్తి ఆధిపత్యం..
బంగ్లాదేశ్‌తో ఇప్పటీవరకు జరిగిన టెస్టుల్లో భారత్‌దే పూర్తి ఆధిపత్యం. ఇరు జట్లు ఇప్పటీవరకు 13 టెస్టు మ్యాచుల్లో తలపడగా.. అందులో టీమిండియా ఏకంగా 11 మ్యాచుల్లో గెలిచింది. మరో 2 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా డ్రాగా ముగిశాయి. బంగ్లా మాత్రం ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేక పోయింది.
వాతవరణం, పిచ్ కండీషన్..
చెపాక్ స్టేడియంలోని ఎర్రమట్టి పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుందని విశ్లేషకుల అంచనా. తొలి రోజు బౌన్స్‌కు అవకాశం ఉంటుంది. తర్వాత పిచ్ ఫ్లాట్‌గా మారుతుంది. మరోవైపు చెన్నైలో ఉష్ణోగ్రత అధికంగా ఉండనుంది. వర్షం పడే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. వేడి అధికంగా ఉంటుందని తెలిపింది.
తుది జట్ల వివరాలు: (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దిప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
బంగ్లాదేశ్: షాదమన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మొమినుల్ ఇస్లాం, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), షకీబుల్ హసన్, మెహదీ హసన్ మీరాజ్, తస్కీన్ అహ్మద్, హసన్ మహ్‌మూద్, నాహిద్ రాణా/తైజుల్ ఇస్లాం.