Friday, November 22, 2024

వెస్టిండీస్‌పై భారత్‌ గెలుపు.. టీ20 సిరీస్‌ 3-0తో క్లీన్‌ స్వీప్‌..

కరేబియన్‌ జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచులో టీమిండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు వెంకటేష్‌ అయ్యర్‌ మెరుపులతో భారత్‌ అసాధారణమైన లక్ష్యాన్ని వెస్టిండీస్‌ జట్టు ముందు ఉంచగలిగింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (31 బంతుల్లో ఒక ఫోర్‌, 7 సిక్సులతో 65 రన్స్‌) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 185 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది. సూర్యకు తోడుగా ఆల్‌ రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు నాటౌట్‌) రాణించడంతో ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్స్‌లో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యుకుమార్‌ యాదవ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లు ఐదో వికెట్‌కు 91 పరుగుల రికార్డు భాగసామ్యాన్ని అందించారు. ఇషాన్‌ కిషన్‌ (34), శ్రేయస్‌ అయ్యర్‌ (25) ఫర్వాలేదనిపించారు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (4), రోహిత్‌ శర్మ (7) తీవ్రంగా విఫలం అయ్యారు. విండీస్‌ బౌలర్లలో హోల్డర్‌, షెపర్డ్‌ , రోస్టన్‌ చేస్‌, వాల్ష్‌, డ్రేక్స్‌కు తలో వికెట్‌ దక్కాయి.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్‌ తగిలింది. చాలా కాలం తరువాత దక్కిన మంచి అవకాశాన్ని రుతురాజ్‌ గైక్వాడ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జాసన్‌ హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (4) భారీ షాట్‌కు ప్రయత్నించి.. మైయర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరుకున్నాడు. ఓపెనింగ్‌ అవకాశాన్ని రుతురాజ్‌ అందిపుచ్చుకోలేకపోయాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. ధాటిగా ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌, రోమారియో బౌలింగ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ బౌండరీలు బాదాడు. అయ్యర్‌ కూడా తన జోరును కొనసాగిస్తూనే వచ్చాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సమయానికి టీమిండియా జట్టు ఒక వికెట్‌ నష్టానికి 43 పరుగులు చేసింది.

పవర్‌ ప్లే ముగిసిన తరువాత.. వాల్ష్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ మూడో బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ (25) హోల్డర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో భారత్‌కు రెండో షాక్‌ తగిలింది. 63 పరుగుల వద్ద అయ్యర్‌ రూపంలో భారత్‌ రెండో వికెట్‌ పోగొట్టుకుంది. ఆ తరువాత చేస్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ నాల్గో బంతికి ఇషాన్‌ కిషన్‌ (34) క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో 66 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఆ తరువాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌లు ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. ధాటిగా ఆడే క్రమంలో డొమ్నిక్‌ డ్రేక్స్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ (7) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

సూర్యకుమార్‌ అర్ధ సెంచరీ..

రోహిత్‌ ఔటైన తరువాత.. సూర్య కుమార్‌ యాదవ్‌తో కలిసి బ్యాటింగ్‌ చేసేందుకు యువ బ్యాటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరు కలిసి వెస్టిండీస్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆచితూచి ఆడుతూనే పరుగుల వరద పారించారు. ఇద్దరూ సిక్సర్లతో స్వైర విహారం చేశారు. దీంతో భారత్‌ స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. ప్రతీ ఒక్కరి బౌలింగ్‌లో అన్ని వైపులా బౌండరీలు, సిక్సులు బాదుతూ తమ సత్తా చూపించారు. డ్రేక్స్‌ వేసిన 19వ ఓవర్‌లో సూర్య ఓ భారీ సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా రెండు బౌండరీలు బాదాడు. దీంతో ఒకే ఓవర్‌లో ఇద్దరు కలిసి 21 పరుగులు పిండుకున్నారు. రోమారియో షెపర్డ్ వేసిన చివరి ఓవర్‌లో సూర్య.. మూడు భారీ సిక్సర్లతో 21 పరుగులు రాబట్టుకున్నాడు. దీంతో భారత్‌ 184 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అయితే ఆఖరి బంతికి సూర్య కుమార్‌ యాదవ్‌ (65) ఔటవ్వగా.. వెంకటేశ్‌ అయ్యర్‌ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

- Advertisement -

టీ20 ఫార్మాట్‌లోని.. డెత్‌ ఓవర్స్‌ అయిన 16 నుంచి 20 ఓవర్స్‌లో అత్యధిక పరుగులు సాధించి రికార్డు నెలకొల్పింది. తాజాగా కోల్‌కతా వేదికగా విండీస్‌పై చివరి 5 ఓవర్స్‌లో 86 పరుగులు పిండుకుంది. దీని కంటే ముందు 2007లో ఇంగ్లండ్‌పై 80 పరుగులు రాబట్టుకుంది. 2019లో ఆస్ట్రేలియాపై 77రన్స్‌, 2010లో దక్షిణాఫ్రికాపై 75 పరుగులు, 2012లో పాకిస్తాన్‌పై 74 పరుగులు టీమిండియా జట్టు పిండుకుంది.

తడబడిన వెస్టిండీస్‌..

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ జట్టుకు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. చాహర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ చివరి బంతికి ఇషాన్‌కు కిషన్‌కు మైయర్స్‌ (6) క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరుకున్నాడు. ఆ తరువాత వచ్చిన పూరన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన హోప్‌ (8) మళ్లిd చాహర్‌ బౌలింగ్‌లోనే ఇషాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. పూరన్‌తో కలిసి పావెల్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఆచితూచి ఆడుతూ.. మంచి భాగస్వామ్యం ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్న క్రమంలోనే.. వీరి జోడీని హర్షల్‌ పటేల్‌ విడదీశాడు. ఠాకూర్‌కు పావెల్‌ (25) క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ తరువాత వచ్చిన వారంతా.. అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. పొలార్డ్ (5), హోల్డర్‌ (2), రోస్టన్‌ చేస్‌ (12) వద్ద ఔటయ్యారు.

పూరన్‌ మాత్రం ఒంటరి పోరాటం కొనసాగిస్తూనే వచ్చాడు. 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షెపర్డ్‌ కూడా పూరన్‌కు చక్కటి భాగస్వామ్యం ఇవ్వడంతో అర్ధ సెంచరీ తరువాత చెలరేగిపోయి ఆడాడు. చివరికి పూరన్‌, షెపర్‌ ్డ జోడీని ఠాకూర్‌ విడదీశాడు. పూరన్‌ను 61 రన్స్‌ వద్ద పెవిలియన్‌ దారి చూపించాడు. ఆ తరువాత షెపర్డ్‌ (29)ను హర్షల్‌ పటేల్‌ ఔట్‌ చేశాడు. డ్రేక్స్‌ 4వద్ద ఔటవ్వగా.. అల్లెన్‌ (5), వాల్ష్‌ (0) నాటౌట్‌గా నిలిచారు. చివరి 20 ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండీస్‌ 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులే చేసింది. దీంతో భారత్‌ 17 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. చాహర్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.

స్కోర్‌బోర్డు

ఇండియా ఇన్నింగ్స్‌ : రుతురాజ్‌ గైక్వాడ్‌ (బి) హోల్డర్‌ (సి) మైయర్స్‌ 4; ఇషాన్‌ కిషన్‌ (బి) రోస్టన్‌ చేస్‌ 34; శ్రేయస్‌ అయ్యర్‌ (బి) హేడెన్‌ వాల్ష్‌ (సి) హోల్డర్‌ 25; రోహిత్‌ శర్మ (బి) డొమినిక్‌ డ్రేక్స్‌ 7; సూర్యకుమార్‌ యాదవ్‌ (బి) రోమారియో షెపర్డ్‌ (సి) పావెల్‌ 65; వెంకటేష్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 35. ఎక్స్‌ట్రాలు : 14. మొత్తం : 20 ఓవర్స్‌లో 5 వికెట్ల నష్టానికి 184. వికెట్ల పతనం : 1-10, 2-63, 3-66, 4-93, 5-184. బౌలింగ్‌ : హోల్డర్‌ 4-0-29-1, రోమారియో షెపర్డ్‌ 4-0-50-1, రోస్టన్‌ చేస్‌ 4-0-23-1, హేడెన్‌ వాల్ష్‌ 4-0-30-1, డొమ్నిక్‌ డ్రేక్స్‌ 3-0-37-1, ఫాబియన్‌ అల్లెన్‌ 1-0-5-0.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ : మైయర్స్‌ (బి) చాహర్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ 6; హోప్‌ (బి) చాహర్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ 8; పూరన్‌ (బి) ఠాకూర్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ 61; పావెల్‌ (బి) హర్షల్‌ పటేల్‌ (సి) ఠాకూర్‌ 25; పొలార్డ్‌డ (బి) వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) రవి బిష్ణోయ్‌ 5; హోల్డర్‌ (బి) వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) శ్రేయస్‌ అయ్యర్‌ 2; రోస్టన్‌ చేస్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 12; షెపర్డ్‌ (బి) హర్షల్‌ పటేల్‌ (సి) రోహిత్‌ 29; అల్లెన్‌ (నాటౌట్‌) 5; డ్రేక్స్‌ (బి) ఠాకూర్‌ (సి) రోహిత్‌ 4; వాల్ష్‌ (నాటౌట్‌) 0. ఎక్స్‌ట్రాలు : 10. మొత్తం : 20 ఓవర్స్‌లో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు. వికెట్ల పతనం : 1-6, 2-26, 3-73, 4-82, 5-87, 6-100, 7-148, 8-158, 9-166. బౌలింగ్‌ : దీపక్‌ చాహర్‌ 1.5-0-15-2, అవేష్‌ ఖాన్‌ 4-0-42-0, వెంకటేష్‌ అయ్యర్‌ 2.1-0-23-2, శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-33-2, రవి బిష్ణోయ్‌ 4-0-29-0, హర్షల్‌ పటేల్‌ 4-0-22-3.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement