కొత్త సంవత్సరంలో భారత్ రెండు మెగా క్రీడా టోర్నీలకు ఆతిథ్యమిస్తోంది. ఒకటి పురుషుల వన్డే కప్‌కాగా మరొకటి పురుషుల హాకీ కప్. ఇందులో హాకీ మెగా ఈవెంట్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. నాలుగోసారి భారత్ ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తోంది. 13 నుంచి 29 వరకు భువనేశ్వర్, రూర్కెలా వేదికలుగా ఈ వరల్డ్ కప్ జరగనుంది. మెగా టోర్నమెంట్ కావడంతో ఆతిథ్య రాష్ట్రమైన ఒడిశా సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మర సన్నాహకాలు చేస్తోంది. తాజా టోర్నీ కోసం రూర్కెలాలోని బిర్సా ముండా హాకీ స్టేడియాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. అంతర్జాతీయ స్థాయి హంగులతో భారీ బడ్జెట్‌తో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా టోర్నీకి సంబంధించిన విశేషాలు..
మ్యాచ్‌లు… జట్లు
ప్రపంచంలోని 16 మేటి జట్లు మొత్తం 44 మ్యాచుల్లో తలపడనున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత్, డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం, ప్రపంచ నెంబర్ 1 ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ , జర్మనీ, న్యూజిలాండ్, అర్జెంటినా, ఇంగ్లండ్,స్పెయిన్, దక్షిణ కొరియా, మలేసియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, జపాన్, చిలీ, వేల్స్ టోర్నమెంట్ బరిలోకి దిగుతున్నాయి. పూల్ మ్యాచ్‌లను భవనేశ్వర్, రూర్కెలాలో నిర్వహిస్తారు. క్వార్టర్ ఫైనల్స్ , సెమీ ఫైనల్స్ , కాంస్య పతక, ఫైనల్ మ్యాచ్‌లు మాత్రం భువనేశ్వర్‌లో జరుగుతాయి. రెండు సెమీస్ జనవరి 27న, ఫైనల్ 29న నిర్వహిస్తారు.
ఇదీ ఫార్మెట్
మొత్తం నాలుగు జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. పూల్‌లోని ప్రతీ జట్టూ ముగ్గురు ప్రత్యర్థులతో ఒకసారి తలపడుతుంది. పూల్‌లో అగ్ర స్థానంలో నిలిచిన జట్టు క్వార్టర్‌లో ప్రవేశిస్తుంది. ఒక్కో పూల్‌లో రెండు, మూడుస్థానాల్లో నిలిచిన టీంలు క్రాస్ ఓవర్ మ్యాచుల్లో ఢీ కొంటాయి. ఆ పోటీల ద్వారా మిగిలిన
నాలుగు క్వార్టర్ ఫైనల్ జట్లను నిర్ధారిస్తారు.