Friday, November 22, 2024

భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత్.. కోవిడ్ తర్వాత కోలుకున్న ఏకైక పర్యాటక రంగం మనదే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కరోనాతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రభావితమైన రంగం పర్యాటకమేనని.. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా భారత పర్యాటక రంగం మాత్రమే విజయవంతంగా కోలుకుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట ముందున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘భారత్ పర్వ్’ ముగింపు కార్యక్రమం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యాటక శాఖ సహాయ మంత్రులు శ్రీపాద యశోనాయక్, అజయ్ భట్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనానంతర పరిస్థితుల్లో భారత పర్యాటక రంగానికి పునర్వైభవాన్ని తీసుకురావడంతోపాటు మరింత ప్రోత్సాహభరితమైన వాతావరణాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేశాయన్నారు.

దీనికితోడు ‘దేఖో అప్నా దేశ్’, ప్రసాద్, స్వదేశ్ దర్శన్  వంటి వివిధ పథకాల ద్వారా పర్యాటక రంగం అభివృద్ధితోపాటు పర్యాటక క్షేత్రాల వద్ద మౌలికవసతుల కల్పన తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోని చారిత్రక, సాంస్కృతిక స్మృతులు (మాన్యుమెంట్స్), సహజమైన ప్రాకృతిక సంపద పర్యాటకాభివృద్ధికి కేంద్రాలని కిషన్ రెడ్డి వెల్లడించారు. చారిత్రక కట్టడాలను సంరక్షించుకుంటూ వాటి ద్వారా పర్యాటకాభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. ప్రజలు భాగస్వామ్యం వహించే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని.. అలాగే దేశ పర్యాటకాభివృద్ధిలోనూ దేశ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. భారతదేశ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపైనా ఉందన్నారు. మేళాలు, ఉత్సవాలు, భారత్ పర్వ్ వంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్టాల్స్ పెట్టుకుని విక్రయించే భారతీయ శిల్ప కళలు, చేతి వృత్తుల కళాకృతులను కొనుగోలు చేయాలని.. ఇది మనకు చిన్న ఖర్చే అయినా.. ఆ కళను బతికించుకునేందుకు గొప్ప సహాయం అవుతుందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల సంయుక్త సమన్వయంతో దేశం వివిధ రంగాల్లో ముందడుగేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో భారతదేశ సంస్కృతి, పర్యాటక రంగ అభివృద్ధి గురించి పేర్కొనడం పట్ల  ధర్మేంద్ర ప్రధాన్ ధన్యవాదాలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాల్లో ప్రజలందరూ ఉత్సాహంగా భాగస్వాములు కావడం.. దేశం పట్ల వారికున్న ప్రేమకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు మాట్లాడిన కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రులు శ్రీపాద యశోనాయక్, అజయ్ భట్ కూడా.. భారత పర్యాటక రంగాభివృద్ధికి జరుగుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. అనంతరం వివిధ రాష్ట్రాల కళాకృతులు, చేనేత వస్త్రాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కేంద్ర మంత్రులు సందర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement