ఆసియా కప్లో ఇండియా-ఏ జట్టు అదరగొట్టింది. ఎమర్జింగ్ ఆసియా కప్ సెమీ ఫైనల్‍లో బంగ్లాదేశ్-ఏ పై భారత యువ జట్టు గెలిచింది. కొలంబో వేదికగా ఇవ్వాల (జూలై 21) జరిగిన సెమీస్ మ్యాచ్‍లో ఇండియా-ఏ 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓడిపోతుందనుకున్న దశలో 66 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు పడగొట్టి భారత్-ఏ జట్టు అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ 49.1 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ యశ్ ధుల్ (66) అర్ధ శతకంతో అదరగొట్టగా.. చివర్లో మానవ్ సూతర్ (21), రాజ్‍వర్ధన్ (15) రాణించారు. దీంతో పోరాడే స్కోరు చేయగలిగింది భారత్.
టార్గెట్ చేజింగ్లో బంగ్లాదేశ్-ఏ 34.2 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ నిశాంత్ సింధు 5 వికెట్లతో బంగ్లాను కుప్పకూల్చాడు. మానవ్ సుతర్ కూడా మూడు వికెట్లతో రాణించాడు. ఓ దశలో 94 పరుగులకు 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన బంగ్లాదేశ్.. భారత బౌలర్లు విజృంభిచటంతో వరుసగా వికెట్లు కోల్పోయి 160 పరుగులకే ఆలౌటైంది. ఇక, మరో సెమీ ఫైనల్‍లో శ్రీలంక-ఏపై పాకిస్థాన్-ఏ విజయం సాధించింది. దీంతో ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్‍లో భారత్-ఏ, పాకిస్థాన్-ఏ తలపడనున్నాయి. ఆదివారం (జూలై 23) ఈ ఫైనల్ ఫైట్ జరగనుంది.