గెలుపెవరిది?టెస్ట్ మ్యాచ్‌కు ఉప్పల్ సిద్ధం
వ్యూహాలతో రంగంలోకి భారత జట్టు
నలుగురు స్పిన్నర్లను దింపే చాన్స్
వరుస విజయాలతో ఉత్సాహంగా ఇంగ్లండ్
ముగ్గురు స్పినర్ లతో బరిలోకి..
సొంతగడ్డపై తిరుగులేని టీమిండియా
అగ్రెసివ్ ప్లేయర్ కోహ్లీ లేకపోవడం ఇబ్బందే
శుభ్‌మన్ గిల్‌పైనే అభిమానుల ఆశలు
రేపటి నుంచి టీమిండియా-ఇంగ్లండ్ టెస్ట్ షూరు
హైదరాబాద్‌లోని ఉప్పల్‌స్టేడియం వేదికగా రేపటి (గురువారం) నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. వరుస విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇంగ్లండ్.. సొంతగడ్డపై తిరుగులేని శక్తిగా ఉన్న టీమిండియా మధ్య జరగబోయే టెస్ట్ మ్యాచ్ అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇంగ్లండ్ బాజ్ బాల్ వ్యూహంతో ముందుకు వస్తుండగా.. భారత్ స్పిన్నర్లను రంగంలోకి దించుతోంది. ఇంగ్లండ్ సైతం ఈ సారి ఎప్పుడూ లేనంతగా నలుగురు స్పిన్నర్లను భారత్‌కు తీసుకువస్తోంది. 2012లో 2-1 తేడాతో భారత్‌లో టెస్టు సిరీస్‌ని ఇంగ్లండ్ నెగ్గింది. ఇక.. ఆ ఓటమి తర్వాత స్వదేశంలో భారత్ 16 సిరీస్ విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఆ ఓటమి తప్పులను సరిదిద్దుకున్న భారత్.. సొంత గడ్డపై టెస్టుల్లో తిరుగులేని శక్తిగా మారింది.
తక్కువ అంచనా వేయలేము..
సొంతగడ్డపై తిరుగులేని శక్తిగా భారత్ ఉన్నప్పటికీ.. ఇంగ్లండ్ జట్టును అంత తేలికగా అంచనా వేయలేమని అనలిస్టులు అంటున్నారు. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు బాజ్ బాల్ వ్యూహంతో భారత్‌ను దెబ్బకొట్టాలని చూస్తోంది. గత రెండేళ్లలో టెస్టుల్లో ఇంగ్లండ్ విజయవంతమైన జట్టుగా ముందుకు సాగుతోంది. ఈ వ్యూహంతో నాలుగు సిరీస్‌లను గెలుచుకోగా, రెండు డ్రాగా ముగిశాయి. పాకిస్థాన్‌లో సీమ్ బౌలింగ్ లేదా ఫ్లాట్ పిచ్‌లపై ‘బాజ్ బాల్ ‘ ఇప్పటివరకు పని చేసినప్పటికీ, ఇంగ్లండ్ ఆల్ అవుట్ అటాక్ స్ట్రాటజీకి భారత్‌లో టర్నింగ్ ట్రాక్‌లపై తొలి అతిపెద్ద పరీక్ష ఎదురుకానుంది.
నలుగురు స్పిన్నర్లకు చాన్స్..
ఇంగ్లండ్‌ని దెబ్బకొట్టేందుకు భారత్ కూడా వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌పై దృష్టి పెట్టింది. బౌలింగ్‌లో ముఖ్యంగా భారత్ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలించే అవకాశముంది. భారత సీనియర్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ ఎలా ఎదుర్కొంటారనేది సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. అలాగే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా జట్టులో ఉండటంతో పరిస్థితులు అనుకూలిస్తే భారత్ నలుగురు స్పిన్నర్లను ప్లేయింగ్ ఎలెవన్ లో ఆడించే అవకాశం ఉంది.
ముగ్గురు స్పిన్నర్లతో ఇంగ్లండ్ – తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఇంగ్లండ్ ఏకంగా ముగ్గురు స్పిన్నర్లను ఫైనల్ లెవన్ లో చోటు కల్పించింది. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌తో పాటు రాబిన్సన్ కూడా బెంచ్‌కే పరిమితం కానున్నారు. స్టోక్స్ సేన తరఫున ఒక్కడంటే ఒక్కడే స్పెషలిస్ట్ పేసర్‌ను ఎంచుకోవడం గమనార్హం. పేస్ బాధ్యతలను మార్క్ వుడ్ మోయనున్నాడు.
ఉప్పల్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలతో బెన్ స్టోక్స్.. రిహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ, జాక్ లీచ్‌ను తుదిజట్టులో చేర్చాడు. ఇందులో జాక్ లీచ్‌కు ఇదివరకే భారత పిచ్‌లపై ఆడిన అనుభవముంది. అహ్మద్ రెండేండ్ల క్రితమే టెస్టులలో ఎంట్రీ ఇచ్చాడు. 24 ఏండ్ల టామ్ హర్ట్లీ రేపటి టెస్టులో అరంగేట్రం చేయనున్నాడు. వీరితో పాటు జట్టులో జో రూట్ కూడా పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఐదుగురు స్పెషలిస్టు బ్యాటర్లు క్రాలే, డకెట్, పోప్, రూట్, బెయిర్ స్టో , ఓ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ , వికెట్ కీపర్ బ్యాటర్ బెన్ ఫోక్స్, ముగ్గురు స్పిన్నర్లు, ఒక్క పేసర్‌తో ఇంగ్లండ్.. ఉప్పల్‌లో తమ బజ్‌బాల్‌ను ఆడనుంది.
కోహ్లీ లేకపోవడం పెద్ద దెబ్బే..
భారత పరిస్థితులపై అత్యంత అనుభవం ఉన్న, స్పిన్‌పై మంచి రికార్డు ఉన్న వెటరన్ జో రూట్ ఇంగ్లండ్‌కు కీలక ప్లేయర్. అతను 10 టెస్టుల్లో 50 సగటుతో 952 పరుగులు చేశాడు. 2021లో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో రూట్ 218 పరుగులు చేశాడు. అలాగే, కెప్టెన్ బెన్ స్టోక్స్ 2016లో రాజ్ కోట్ లో జరిగిన తొలి టెస్టు ఇన్నింగ్స్ లో సెంచరీ (128) సాధించాడు. దేశంలో తొమ్మిది టెస్టులు ఆడి 32 సగటుతో 548 పరుగులు చేశాడు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. ఇక.. భారత్ టీమ్ కు స్టార్ ప్లేయర్ విరాట్ దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బే.