న్యూఢిల్లి : కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు వ్యాక్సినేషన్లో భారత్ వేగం పెంచింది. అదేవిధంగా టీకా ఉపయోగంపై కూడా ప్రపంచ వ్యాప్తంగా అవగాహన చేపడుతోంది. వ్యాక్సిన్ తీసుకోవాలని అన్ని దేశాల ప్రజలను తనవంతు ప్రయత్నంగా చైతన్యవంతులను చేస్తోంది. ఇతర దేశాలకు టీకాలను కూడా అందజేస్తూ.. పెద్ద మనస్సును చాటుకుంటోంది. ఇప్పటి వరకు 90కు పైగా దేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి చేసినట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. భారత్-మధ్య ఆసియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యాక్సిన్ల తయారీ, ఎగుమతుల్లో భారత్ దూసుకుపోతోందన్నారు.
కరోనా మహమ్మారి సమయంలో వివిధ దేశాల్లోని భారతీయ విద్యార్థుల సంక్షేమం ఆయా దేశాలతో సంబంధాల వేగాన్ని స్తంభించేలా చేసిందన్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మరోవైపు ఆఎn్గానిస్తాన్‌తో అందరికీ మంచి సంబంధాలు ఉన్నాయని వివరించారు. కానీ అక్కడ ఉగ్రవాదం, మాదకద్రవ్యాల సరఫరా.. మహిళలు, పిల్లలు, మైనార్టీల హక్కులను కాలరాయడం ఆందోళన కలిగించే అంశాలు అని తెలిపారు. ఏ దేశానికి అయినా తాము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా వేళ ఎన్నో దేశాలకు ఉచితంగా మందులు అందజేసిన ఘనత భారత్‌ది అని చెప్పుకొచ్చారు. ఢిల్లిdలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి కజకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్, తజికిస్తాన్, తుర్కెమెనిస్తాన్‌తో పాటు ఉజ్బెకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు.