డిజిటల్ చెల్లింపుల్లో మన దేశం అగ్ర స్థానంలో నిలిచింది. 2022లో మన దేశంలో 89.5 మిలియన్ డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఇది మొత్తం గ్లోబల్ రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో మన దేశం 46 శాతం లావాదేవీలు జరిగాయి. తరువాత నాలుగు స్థానాల్లో ఉన్న దేశాల మొత్తం చెల్లింపుల లావాదేవీల కంటే కూడా మన దేశంలో జరిగినవే ఎక్కువగా ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్ విషయంలో మన దేశం సరికొత్త మైలురాళ్లను అధిగమించింది. లావాదేవీల పరంగానే కాకుండా లావాదేవీల విలువలోనూ మన దేశం అగ్రస్థానంలో నిలిచింది. మన దేశంలో ఉన్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, దాన్ని ప్రజలు ఆమోదించడం మూలంగానే భారీగా లావాదేవీలు జరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డిజిటల్ చెల్లింపుల ల్యాండ్‌స్కేప్‌లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోందని, వినూత్న పరిష్కారాలు, విస్త్రతమైన స్వీకరణతో నగదు రహిత ఆర్ధిక వ్యవస్థ వైపు దారి చూపుతున్నామని దీనిపై మైగౌఇండియా ట్విట్ చేసింది. మన దేశం తరువాత డిజిటల్ చెల్లింపుల్లో 29.2 మిలియన్ల లావాదేవీలతో బ్రెజిల్, 17.6 మిలియన్ లావాదేవీలతో చైనా, 16.5 మిలియన్ లావాదేవీలతో థాయిలాండ్, 8 మిలియన్ లావాదేవీలతో దక్షిణ కొరియా తరువాత నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఈ దేశాలన్నింటి లావాదేవీలు కలిపినా మన దేశంలో జరిగిన డిజిటల్ లావాదేవీల కంటే తక్కువగానే ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల్లో మన దేశం అగ్రస్థానంలో ఉందని, అతి తక్కువ ధరకే డేటా అభిండచం కూడా ఇందుకు ఒక కారణమని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కూడా రూపాంతరం చెందుతున్నదని ఆయన చెప్పారు.