స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన అంశాలపై భారత్ దృష్టిసారించింది. బ్రిటన్‌తో ఇదే అంశంపై చర్చలకు ఒత్తిడి తెస్తున్న భారత్, త్వరలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)తోనూ చర్చలు ప్రారంభించనుంది. ఈ మేరకు ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. బహుశా వచ్చే వారమే చర్చలు ప్రారంభం కావొచ్చని పేర్కొన్నారు. ఈ విషయమై జీసీసీ అధికారులు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నట్లు సదరు అధికారి తెలిపారు. జీసీసీలో సౌదీ అరేబియా, యూఏఈ, కతార్ కువైట్, ఒమన్, బహ్రెన్ సహా మొత్తం ఆరు సభ్యదేశాలు ఉన్నాయి. ఈ ఏడాది మే నుంచి యూఏఈతో ఎఫ్‌టీఏను అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో, మిగతా గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా చర్యలను వేగవంతం చేస్తున్నదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల మాట్లాడుతూ, త్వరలో మరో ఎఫ్‌టీఏపై చర్చలు జరగబోతున్నాయని సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే.
దశాబ్దం తర్వాత ఎఫ్‌టీఏ చర్చలు..
జీసీసీతో ఇప్పటికే రెండు సార్లు ఎఫ్‌టీఏపై చర్చలు జరిగాయి. 2006, 2008 సంవత్సరాలలో జరిగిన ఈ చర్చలు పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ఎఫ్‌టీఏలను తాత్కాలికంగా నిలిపివేయాలని జీసీసీ నిర్ణయించడంతో అప్పటి నుంచి చర్చలు జరగలేదు. గల్ఫ్‌దేశాలైన సౌదీ, కతార్ నుంచి భారత్ ప్రధానంగా ముడి చమురు, సహజవాయువు దిగుమతి చేసుకుంటోంది. అదే సమయంలో విలువైన రాళ్లు, ముత్యాలు, లోహాలు, ఇమిటేషన్ నగలు, ఎలక్ట్రికల్ యంత్రాలు, ఇనుము, ఉక్కు, రసాయనాలను భారత్ ఎగుమతి చేస్తుంది. 2020-21లో భారత ఎగుమతుల విలువ జీసీసీ దేశాలకు 27.8 బిలియన్ డాలర్లకు చేరింది. 2021-22నాటికిఅది 44 బిలియన్ డాలర్లకు పెరిగింది. భారతదేశ మొత్తం ఎగుమతుల్లో జీసీసీ దేశాల వాటా 10.4శాతంగా ఉంది. జీసీసీ దేశాల నుంచి దిగుమతుల విలువ కూడా క్రమేణా పెరుగుతోంది. గతేడాది 85.8 శాతం పెరిగి 110.73 బిలియన్ డాలర్లకు చేరింది. దేశ మొత్తం ఎగుమతుల్లో ఈ ఆరు దేశాల వాటా 18శాతానికి చేరింది. ద్వైపాక్షిక వాణిజ్యం 154.73 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
గల్ఫ్‌తో విడదీయరాని అనుబంధం..
వాణిజ్యపరంగానే కాకుండా గల్ఫ్ దేశాలతో భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంది. ఇక్కడ ప్రవాస భారతీయుల జనాభా గణనీయంగా ఉంది. 32 బిలియన్ల ప్రవాస భారతీయుల్లో సగానికిపైగా జీసీసీ దేశాల్లోనే ఉంటున్నారు. వీరి సంపాదన మన విదేశీ మారక నిల్వలకు ప్రధాన వనరుగా ఉంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం విదేశాల్లో ఉన్న భారతీయులు పంపే డబ్బు విలువ 2021లో 87 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇందులో జీసీసీ దేశాలదే కీలకవాటా. గత ఆర్థిక సంవత్సరానికి గాను సౌదీ అరేబియా ఇండియాకు నాల్గవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నది. యూఏఈ మూడవ స్థానంలోఉండగా, కువైట్ 27వ స్థానంలో ఉన్నది. కతార్ నుంచి భారత్ ప్రతిఏటా సగటున 8.5 మిలియన్ టన్నల ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంటోంది. చిరు ధాన్యాలు, చేపలు, రసాయనాలు, ప్లాస్టిక్స్ ఎగుమతి చేస్తోంది.