Saturday, November 2, 2024

India-Canada | కెనడా అధికారికి భారత్‌ సమన్లు..

కెనడాలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ భారత్‌-కెనడాల మధ్య దౌత్యసంబంధాలు మరింతగా క్షీణిస్తున్నాయి. ఇప్పటికే రాయబారులను వెనక్కి పిలిచిన ఇరుదేశాలు.. తాజాగా ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఖలిస్తానీ ఉగ్రవాదుల విషయంలో భారత్‌తో సంబంధాలను చెడగొట్టేందుకు కెనడా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

ఇటీవల ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. తాజాగా ఆయన మంత్రి డేవిడ్‌ మారిసన్‌ భారత హోం మంత్రి అమిత్‌ షాపై విరుచుకుపడ్డారు. ఖలిస్తానీలను టార్గెట్‌ చేసేందుకు అమిత్‌షా కుట్ర పన్నారని, ఖలిస్తానీ సానుభూతిపరులపై దాడుల వెనక భారత పాత్ర ఉందంటూ మోరిసన్‌ ఆరోపించారు.

కాగా, మారిసన్‌ వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. కెనడా హైకమిషన్‌ ప్రతినిధిని పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అవి అసంబద్ధమైనవని, నిరాధారమైనవని భారత్‌ కొట్టిపారేసింది. అంతర్జాతీయంగా తమ దేశ పరువు తీసేందుకు కెనడా ప్రయత్నిస్తున్నదని భారత్‌ మండిపడింది.

కెనడా-భారతదేశం మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌. 2023లో కెనడాలోని గురుద్వారాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత ప్రభుత్వం హస్తం ఉన్నదని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో గత ఏడాది ఆరోపించారు.

ఆ తర్వాత ఈ ఏడాది మే నెలలో నిజ్జర్‌ హత్యకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు దౌత్యసిబ్బందిని బహిష్కరించుకున్నాయి. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య పరిస్థితులు చెడిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement