ప్రపంచంలోనే అతిపెద్ద యాక్టివ్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్‌ను కలిగివున్న దేశాల జాబితాలో భారత్ నాల్గవ స్థానంలో నిలిచింది. భారత వైమానికదళం, ఇండియన్ ఆర్మీ ఏవియేషన్, ఇండియన్ నేవీలో మొత్తం 2,182 యాక్టివ్ మిలటరీ ఫ్లయింగ్ ప్లాట్ ఫారమ్‌లు మోహరించబడి వున్నాయి. ఈ మేరకు ప్రపంచ వైమానిక దళం విడుదల చేసిన నివేదికలో పేర్కొనబడింది. ప్రపంచంలోని మొత్తం సైనిక విమానాల్లో భారత్ వాటా 4 శాతంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ర్యాంకింగ్ స్థిరంగా ఉందని ఫ్లయిట్ గ్లోబల్ వైమానికదళ వార్షిక డైరెక్టరీ తెలిపింది. ఈ ఫ్లీట్‌లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు, ట్రాన్స్‌పోర్టు విమానాలు, ట్రైనింగ్ విమానాలు, ఇతర వైమానిక ప్రత్యేక విమానాలున్నాయి. మిషన్ ప్లాట్ ఫారమ్‌లు, యుద్ధ విమానం, రవాణా విమానం, యుద్ధ హెలికాప్టర్ విభాగాలలో భారతదేశం వరుసగా 694, 253, 805 ప్లాట్‌ఫారమ్‌లతో నాల్గవ స్థానంలో ఉంది.
అయితే, ప్రత్యేక మిషన్ (71)ప్లాట్‌ఫారమ్‌లలో మాత్రం మనదేశం ఐదవ స్థానంలో ఉండగా, ట్రైనర్లలో (353) ఆరవ స్థానంలో ఉంది. ఈ నివేదికలో 248 సుఖోయ్-30 యుద్ధ విమానాలు, 130 జాగ్వార్‌లు, 128 మింగ్-21 ఎస్ ఫైటర్లు, 65 మిగ్ -29 ఫైటర్లు, 45 మిరాజ్ 2000ఎస్ జెట్‌లు, 19 తేజస్, 23 రాఫెల్ ఫైటర్లను భారత్ కలిగివున్నట్లు పేర్కొనబడింది. వాస్తవానికి ఈ నివేదిక ద్వారా గణాంకాలను సంకలనం చేసిన తర్వాత, ఇటీవలి రోజుల్లో మరో ఏడు రాఫెల్ విమానాలు భారత వైమానిక దళంలోకి ప్రవేశించాయి. దీంతో మొత్తం యుద్ధవిమానాల సంఖ్య 700కి చేరుకుం ది. కాగా, వైమానిక యుద్ధ ట్యాంకర్ల విభాగంలో భారత్ టాప్-10లో లేదు. ప్రస్తుతం మనదేశం వద్ద 6 ఐఎల్- 78లు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా పూర్తి స్థాయిలో సేవలు అందించడంలో సమస్యలను ఎదుర్కొం టున్నాయి.
తాజా నివేదికలోని ఆరు ప్రధాన విభాగాల్లో అమెరికాయే ప్రథమ స్థానంలో ఉన్నది. వాటి మొత్తం విమానాల సంఖ్య 13,246గా ఉంది. ఇది ప్రపంచ దేశాల వైమానిక శక్తిలో 25శాతం. తాలిబన్‌ల స్వాధీనం తర్వాత అఫ్గాన్ వైమానిక దళం దాదాపుగా నిర్వీర్యం కావడంతో, ప్రపంచ వైమానిక శక్తి గతేడాది కంటే 292 విమానాల తగ్గుదలను నమోదుచేసింది. ఇక యుద్ధ విమానాల విభాగంలో అమెరికాకు చెందిన ఎఫ్-16 ఆధిపత్య ఉనికిని చాటుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రకం ఫైటర్లు వివిధ దేశాల్లో 2,248 ఉన్నాయి. జెట్‌ఫైటర్ల వాటాలో ఎఫ్-16 భాగస్వామ్యం 15శాతంగా ఉంది. దీనితర్వాత సుఖోయ్ విమానాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 1063గా ఉంది. వీటిలో 248 ఫైటర్లు మన దేశంలోనే ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital