Friday, November 22, 2024

ఇండియాకు 31 వేల మంది పైలట్లు అవసరం..

భారత్‌కు రానున్న 20 సంవత్సరాల్లో 31000 మంది విమాన పైలట్స్‌ అవసరం అవుతారని అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ అంచనా వేసింది. వీరితోపాటు 26 వేల మంది మెకానికులు అవసరం అవుతురాని తెలిపింది. భారత్‌కు చెందిన వివిధ విమానయాన సంస్థలు భారీగా కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బోయింగ్‌ ఈ అంచనా వేసింది.

వచ్చే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఇండియన్‌ ఏవియేషన్‌ రంగం వృద్ధి చెందుతుందని బోయింగ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ సలీల్‌ గుప్తా ముంబైలో సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. దేశంలో విమానయాన రంగం వృద్ధికి ఎయిర్‌పోర్టుల అభివృద్ధితో పాటు, విమానాల నిర్వహణకు అవసరమైన నిపుణులైన సిబ్బంది కూడా కావాలని ఆయన చెప్పారు.

ఇటీవలే ఎయిర్‌ ఇండియా 470 కొత్త విమానాలకు బోయింగ్‌, ఎయిర్‌బస్స్‌లకు ఆర్డర్‌ ఇచ్చింది. ఇండిగోతో పాటు మరికొన్ని సంస్థలు కూడా భారీగా కొత్త విమానాలను సేకరించేందుకు ఆర్డర్‌ పెట్టాయి. ఇండియాలో ఎయిర్‌ ట్రాఫిక్‌ 7 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని బోయింగ్‌ అంచనా వేసింది. రానున్న సంవత్సరాల్లో నారోబాడీ విమానాలకు డిమాండ్‌ పెరుగుతుందని ఆయన చెప్పారు. ఇందుకు బోయింగ్‌ సరఫరాలను పెంచనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement