- అండర్-19 ఛాంపియన్ గా బంగ్లాదేశ్ !
దుబాయ్ : అండర్-19 ఆసియా కప్ టైటిల్ ను భారత జట్టు చేజార్చుకుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్స్ లో యంగ్ ఇండియా ఓటమిపాలైంది. కీలక పోరులో బౌలర్లు మెరిసినప్పటికీ.. బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా టైటిల్ పోరులో యువ భారత్ 59 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ మరోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది.
కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టును 198 పరుగులకే పరిమితం చేసింది టీమిండియా. భారత బౌలర్లలో యుధాజిత్ గుహా (2/29), చేతన్ శర్మ (2/48), హార్దిక్ రాజ్ (2/41) రెండేసి వికెట్లు తీయగా.. కిరణ్ చోర్మలే, కేపీ కార్తికేయ, ఆయుష్ మాత్రే తలో వికెట్ తీశారు. అయితే స్వల్ప టార్గెట్ తో చేజింగ్ కు దిగిన యువ భారత్ బ్యాటింగ్ లో తేలిపోయింది. 35.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది.
భారత ఆటగాళ్లలో ఏ ఒక్క బ్యాటర్ కూడా కనీసం 30 పరుగులు చేయలేదు. కెప్టెన్ మహ్మద్ అమన్ (26) టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొమ్మిదో స్థానంలో వచ్చిన హార్ధిక్ రాజ్ (24), సిన్హార్డ్ (20), కార్తికేయ (21) పరుగులు చేశారు. ఓపెనర్లు ఆయుష్ మాత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమయ్యారు. నిఖిల్ కుమార్ (0), హర్వా సింగ్ (6) కూడా నిరాశపర్చారు. బంగ్లా బౌలర్లలో ఇక్బాల్ 3, హకీమ్ తమీమ్ 3, ఫహద్ 2, మరుఫ్, రిజాన్ హసన్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లా 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. రిజాన్ హసన్ (47; 65 బంతుల్లో 3 ఫోర్లు), షిహాబ్ (40; 67 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ఫరీద్ హసన్ (59, 69 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.