Friday, November 22, 2024

భారత్‌ సెమీ కండక్టర్ల హబ్‌.. ప్రపంచ స్థాయిలో కీలక భాగస్వామి..

భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఆర్థికంగా, సామాజికంగా, టెక్నాలజీ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నదని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ఈ టెక్నాలజీ రంగ అభివృద్ధిలో సెమీ కండక్టర్ల పాత్ర అత్యంత కీలకం అన్నారు. బెంగళూరు వేదికగా.. మూడు రోజుల పాటు జరిగే.. సెమికాన్‌ ఇండియా సదస్సు-2022ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయంగా, అంతర్జాతీయంగా సెమీ కండక్టర్లకు ఎంతో డిమాండ్‌ ఉందని, దీని సరఫరా వ్యవస్థలో కీలక భాగస్వాముల్లో ఒకటిగా భారత్‌ ఎదగడం కోసం సమష్టి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సెమీ కండక్టర్ల టెక్నాలజీ కోసం ఆకర్షణీయ గమ్యస్థానంగా భారతదేశం ఉండటానికి ఆరు కారణాలు కనిపిస్తున్నట్టు తెలిపారు.

సెమికాన్‌ ఇండియా ప్రోగ్రామ్‌..

ఉత్తమ సాంకేతికత పరిజ్ఞానం, అత్యధిక నాణ్యత, సమున్నత విశ్వసనీయత సిద్ధాంతం ఆధారంగా కృషి చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. భారత్‌ను సెమీ కండక్టర్లకు హబ్‌గా మార్చాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రకటించిన సెమికాన్‌ ఇండియా ప్రోగ్రామ్‌ గురించి కూడా ప్రస్తావించారు. 10 బిలియన్‌ డాలర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. సెమీ కండక్టర్లు, మ్యానుఫ్యాక్చరింగ్‌, డిజైన్‌ ఇకో సిస్టమ్స్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఆర్థిక మద్దతు ఇవ్వడం కోసం దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. క్లీన్‌ ఎనర్జీ టెక్నాలజీస్‌, 5జీ సామర్థ్య అభివృద్ధిలో పెట్టుబడులు, ఆరు లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్టు మోడీ తెలిపారు. దీంతో భారతదేశం తదుపరి సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి భారతదేశం నాయకత్వం వహించడానికి బాటలు వేస్తున్నట్టు తెలిపారు.

వేగంగా స్టార్టప్‌ కంపెనీల వృద్ధి ..

ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్టార్టప్‌ కంపెనీలకు అనుకూల పరిస్థితులతో మన దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా వృద్ధి చెందబోతోందని మోడీ చెప్పుకొచ్చారు. 130 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయులను అనుసంధానం చేయడానికి డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భారతదేశం నిర్మిస్తోందని వివరించారు. బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ముందడుగు వేసిందన్నారు. 2026 నాటికి 80 బిలియన్‌ డాలర్ల విలువైన సెమీ కండక్టర్లు అవసరం అవుతాయని, 2030 నాటికి 110 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (వ్యాపారాన్ని సులభతరం చేయడానికి) మరింత మెరుగుపర్చేందుకు విస్తృత స్థాయిలో సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు. అగ్రశ్రేణిలో ఉన్న 25 సెమీ కండక్టర్ల డిజైన్‌ కంపెనీల డిజైన్‌ లేదా పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాలు దేశంలోనే ఉన్నాయని ప్రకటించారు. సెమీ కండక్టర్లను డిజైన్‌ చేసే మేధావులు భారత్‌లో చాలా మంది ఉన్నారని వివరించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement