Saturday, November 23, 2024

భారత్‌ సూపర్‌, వారి విదేశాంగ విధానం భేష్‌.. రష్యా విదేశాంగ మంత్రి లవ్‌రోవ్‌

ఏ దేశం ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన ప్రయోజనాలు, అభివృద్ధి, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్న భారత విదేశాంగ విధానం భేషుగ్గా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవ్‌రోవ్‌ ప్రశంసించారు. విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్న ఎస్‌.జయశంకర్‌ నిజమైన దేశభక్తుడని, సరైన సమయంలో కీలకమైన శాఖకు సారథ్యం వహిస్తున్న గొప్ప వ్యక్తి అని మెచ్చుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఐరోపా దేశాలు ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ రష్యానుంచి చమురు, ఆయుధ సామగ్రిని దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ఆయా దేశాలనుంచి ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. తమ ఆంక్షలను నిర్వీర్యం చేసేలా భారత్‌ ప్రయత్నించకూడదని అమెరికా అధ్యక్షుడు, ఐరోపా దేశాలు పలుమార్లు పరోక్షంగా, సూటిగానూ విమర్శించాయి. అయినప్పటికీ దీటుగా జవాబిచ్చిన భారత్‌ దేశ అవసరాలను బట్టి మాస్కోనుంచి చమురు, ఆయు ధాలు దిగుమతి చేసుకుంటోంది. ఈ విషయాన్ని లవరోవ్‌ ప్రస్తావిస్తూ భారత విదేశాంగ విధానాన్ని పదేపదే ప్రశంసించారు. ఇంత స్వతంత్రంగా వ్యవహరించగల దేశాలు ప్రస్తుత ప్రపంచంలో చాలా తక్కువని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహారం భద్రత, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాల్లో పశ్చిమ దేశాలప తాము ఆధారపడలేమని, చాలాచాలా పాత మిత్రురాలైన భారత్‌నుంచి సహకారం కోరుకుంటామని అన్నారు. ఒకప్పుడు భారత్‌-రష్యాలమధ్య వ్యూహాత్మక భాగస్వామ్యమే ఉండేదని, కానీ రెండు దశాబ్దాలక్రితం ఇరుదేశాల మధ్య బంధం మరింత బలోపేతమై ప్రత్యేక, వ్యూహాత్మక బంధంగా మారిందని గుర్తు చేశారు. ద్వైపాక్షిక బంధంలో ఇదో విభిన్నమైన మార్పుగా ఆయన అభివర్ణించారు. భారత ప్రధాని నరేంద్రమోడీ సూచించిన మేక్‌ ఇన్‌ ఇండియా విధానానికి తాము సమర్ధిస్తున్నామని, సహకరిస్తున్నామని చెప్పారు. రక్షణరంగం సహా భారత్‌కు ఏం కావాలన్నా అందిస్తామన్నారు.

భారత్‌ ఎగుమతులపై ఆసక్తి..

ఉక్రెయిన్‌పై యుద్ధం దరిమిలా ఐరోపా, అమెరికా ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా భారత్‌నుంచి ఎగుమతులు పెరగాలని కోరుకుంటోంది. పైగా రూపాయి-రూబుల్‌ చెల్లింపుల విధానంపై కసరత్తు చేస్తోంది. ప్రత్యేకించి ఔషధ తయారీ పరిజ్ఞానం, సాంకేతిక పరికరాల విషయంలో భారత్‌నుంచి సహకారాన్ని కోరుకుంటోంది. నిజానికి ఆయా రంగాల్లో చైనా, అమెరికానుంచి రష్యా పెద్దఎత్తున దిగుమతులు చేసుకునేది. కానీ ఆంక్షలతో ఎక్కడికక్కడ దిగుమతులు నిలిచిపోయాయి. అమెరికా, ఐరోపా ఆంక్షలను లెక్కచేయని భారత్‌నుంచి ఆయా వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందుకోసం ఈనెల 22న ఇరుదేశాల ఫార్మా రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, అధికారులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ డివైస్‌ ఇండస్ట్రీ కోఆర్డినేటర్‌ రాజీవ్‌నాథ్‌ వెల్లడించారు. ఈ ఏడాదిలో రష్యాతో భారత్‌ వాణిజ్యం పదిరెట్లు పెరగాలని భావిస్తున్నారని, దాదాపు 2 బిలియన్‌ రూపాయల మేర వాణిజ్యం పెరిగేలా ప్రణాళిక ఉందని ఆయన చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement