Friday, November 22, 2024

T20WC | సూపర్‌-8 స‌మ‌రానికి భారత్ రె’ఢీ’.. ఆఫ్గాన్‌తో మరికొద్ది సేపట్లో మ్యాచ్..

బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్‌) : టీ20 ప్రపంచకప్‌లో తొలి దశ గ్రూప్‌ మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్పుడు సూపర్‌-8 పోరుకు రంగం సిద్ధమైంది. నేడు బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా జరిగే తమ గ్రూప్‌- 1తొలి మ్యాచ్‌లో టీమిండియా, అఫ్గానిస్తాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

అయితే అమెరికా వేదికగా జరిగిన గ్రూప్‌ మ్యాచుల్లో టీమిండియా తమ స్థాయికి తగ్గట్టు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించినా.. బ్యాటర్లు మాత్రం తడబాటుకు గురయ్యారు. డ్రాప్ ఇన్‌ పిచ్‌లపై భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్యాలను సైతం ఛేదించడానికి చెమటోడ్చాల్సి వచ్చింది. అమెరికా స్లో పిచ్‌లపై గెలుపు కోసం రోహిత్‌ సేన చాలా శ్రమించింది.

అయితే ఇప్పుడు సూపర్‌-8 మ్యాచ్‌లన్ని వెస్టిండీస్‌ వేదికగా జరగనుండటం టీమిండియాకు ఊరట కలిగించే అంశం. విండీస్‌ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. మరోవైపు స్పిన్నర్లకు కూడా ఇక్కడి పిచ్‌లు గొప్పగా సహకరిస్తాయి. దాంతో రోహిత్‌ సేన సూపర్‌-8లో మళ్లి జోరును ప్రదర్శించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

- Advertisement -

కొన్ని మార్పులతో టీమిండియా..

గ్రూప్‌ దశ మ్యాచ్‌లన్ని అమెరికా వేదికగా ఆడిన టీమిండియా.. ఇప్పుడు సూపర్‌-8 మ్యాచ్‌లను కరీబియన్‌ దీవుల్లో ఆడనుంది. యూఎస్‌ఏ పిచ్‌లు బౌలింగ్‌కు సహకరిస్తే.. విండీస్‌ పిచ్‌లు మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. మరోవైపు స్పిన్‌కు స్వర్గధామం.

దాంతో ఈసారి టీమిండియా తుది జట్టులో కొన్ని మార్పు లు జరగడం ఖాయమనిపిస్తోంది. ఓపెనర్‌గా పెద్దగా ప్రభావం చూపలేక పోతున్న విరాట్‌ కోహ్లీని వన్‌ డౌన్‌లో ఆడించే అవకాశం ఉంది. దాంతో తో మ్యాచ్‌లో రోహిత్‌ కలిసి యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు.

మరోవైపు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై టీమిండి యా ఈసారి ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరూ పేసర్లతో బరిలోకి దిగనుంది. దాంతో గత మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపని రవీంద్ర జడేజా, పేసర్‌ సిరాజ్‌లపై వేటు పడే అవకాశా లున్నాయి. వీరిద్దరి స్థానంలో ఓపెనర్‌ జైస్వాల్‌, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కుల్దిప్‌ యాదవ్‌లు తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.

ఇక తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన సూర్యకుమార్‌ యాదవ్‌.. అమెరికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో అజేయ హాఫ్‌ సెంచరీతో మళ్లి ఫామ్‌ను అందుకోవడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. మరోవైపు రిషభ్‌ పంత్‌ కూడా బ్యాటింగ్‌లో సత్తా చాటుతున్నాడు. అలాగే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా పర్వాలేదనిపి స్తున్నాడు. చివరి మ్యాచ్‌ ఆల్‌రౌండర్‌ శివం దూడే కూడా రాణించడం భారత్‌కు శుభసూచికమే.. ఇక బౌలింగ్‌లో పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌లు విధ్వంసలు సృష్టిస్తున్నారు.

అఫ్గానిస్తాన్‌ ను తక్కువ అంచనా వేయలేం..

లీగ్‌ దశలో మూడు విజయాలతో సూపర్‌-8కు దూసుకొచ్చిన పసికూన అఫ్గానిస్తాన్‌ను తక్కువ అంచనా వేయలేం. గ్రూప్‌ దశలో పటిష్టమైన న్యూజిలాండ్‌ను 84 పరుగుల తేడాతో చిత్తు చేసి అఫ్గానిస్తాన్‌ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో అఫ్గానిస్తాన్‌ జట్టుకు తిరుగేలేదు.

బ్యాటింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌ 167 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఇబ్రహీం జద్రాన్‌ (152) కూడా టాప్‌-5లో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లోనూ పేసర్‌ ఫజల్‌ హక్‌ ఫారూఖీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. తొలి మూడు మ్యాచుల్లో అఫ్గానిస్తాన్‌ బౌలర్లు ప్రత్యర్థి జట్లను వంద పరుగులలోపై కట్టడి చేసి సత్తా చాటుకున్నారు.

ఇక స్పిన్‌కు స్వర్గధామమైన విండీస్‌ పిచ్‌లపై ప్రపంచ టాప్‌ క్లాస్‌ స్పిన్నర్లు రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీలతో పాటు నూర్‌ అహ్మద్‌ల త్రయం మళ్లి విజృంభించేందకు సిద్ధంగా ఉంది. మొత్తంగా సంచలన జట్టుగా పేరొం దిన అఫ్గానిస్తాన్‌ ఇప్పుడు సూపర్‌-8లో టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకూ రెడీ అయింది.

జట్ల వివరాలు (అంచనా):

భారత్‌: యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సుర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబె/యాజువేంద్ర చాహల్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్ప్రీత్‌ బుమ్రా. కుల్దిప్‌ యాదవ్‌.

అఫ్గానిస్తాన్‌: ఇబ్రహీం జద్రాన్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌ (వికెట్‌ కీపర్‌), గుల్బదీన్‌ నైబ్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, నజీబుల్లా జద్రాన్‌, మహ్మద్‌ నబీ, కరీమ్‌ జన్నాత్‌, రషీద్‌ ఖాన్‌ (కెప్టెన్‌), నూర్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, ఫజల్‌ హక్‌ ఫారూఖీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement