బంగ్లాదేశ్ తో చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించింది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(4/50) నిప్పులు చెరిగాడు. ఆకాశ్ దీప్, జడేజా, సిరాజ్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. దాంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో షకీబ్ అల్ హసన్(64 బంతుల్లో 5 ఫోర్లతో 32), మెహ్‌దీ హసన్ మీరాజ్(52 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్… రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి.. 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. శుభ్‌మన్ గిల్ (33), రిషబ్ పంత్ (12) క్రీజులో ఉన్నారు. అయితే, 227 పరుగుల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు శుభారంభం దక్కలేదు.
కెప్టెన్ రోహిత్ శర్మ (5) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన జైస్వాల్ (10), తన పేలవ ఫామ్ కంటిన్యూ చేస్తూ కోహ్లీ(17)లు పెవిలియన్‌కు చేరుకున్నారు. దీంతో భారత్ 67 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడుతున్నాడు. రిషబ్‌పంత్‌తో కలిసి రెండో రోజు ఆటను ముగించాడు.
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్ (113; 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా.. రవీంద్ర జడేజా (86; 124 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (56; 118 బంతుల్లో 9 ఫోర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు.
కాగా, 376 ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్… 37 పరుగులు మాత్రమే జోడించింది. సెంచరీ హీరో అశ్విన్ ఏడు పరుగులే చేయగా.. జడేజా ఒక్క పరుగు కూడా జోడించలేదు. ఆకాశ్ దీప్(17), బుమ్రా(7), సిరాజ్(0) నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహముద్(5/83) ఐదు వికెట్లు తీయగా.. టాస్కిన్ అహ్మద్(3/55) మూడు వికెట్లు పడగొట్టాడు. నహిద్ రాణా, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.