కొవిడ్ వల్ల మరణించినవారి సంఖ్యను లెక్కగట్టే విధానం సరిగ్గా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పటివరకు ఆరుసార్లు లేఖలు రాసింది. ఇటీవల జరిగిన వెబినార్‌లోనూ ఈ విషయాన్ని గట్టిగా చెప్పింది. ప్రపంచం మొత్తంమీద కోవిడ్ మహమ్మారిబారిన పడి మరణించినవారి సంఖ్యను లెక్కగట్టి, బహిరంగ పరిచే అంశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్-డబ్ల్యూహెచ్‌ఓ) చేస్తున్న ప్రయత్నానికి భారత్ అడ్డుతగులుతోందంటూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. పైగా భారత్ ఏ విధానంలో మరణాల సంఖ్యను లెక్కగడుతోందో చెప్పడం లేదని, వాస్తవ మరణాలకన్నా తక్కువగా చూపుతోందని ఆ కథనంలో ఆరోపించింది. ఈ నేపథ్యంలో భారత ఆరోగ్యమంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఓ ప్రకటన చేసింది. భారత్‌లో కోవిడ్ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని, అయితే ఆ గణాంకాలు బహిర్గతం చేయడం లేదని వస్తున్న ఆరోపణలపైనా స్పందించింది. డబ్ల్యూహెచ్‌ఓ అనుసరిస్తున్న మరణాల సంఖ్యను లెక్కగట్టే విధానాన్ని తప్పుపట్టింది. టైర్ 1 దేశాల్లో మరణాల సంఖ్యను లెక్కగట్టినట్లు టైర్ 2 దేశాల్లోనూ లెక్కగట్టడం సరికాదని స్పష్టం చేసింది. భారత్ సువిశాలమైన దేశమని, జనాభా కూడా అత్యధికంగా ఉందని, నైసిర్గకంగానూ ఎన్నో విభిన్నతలతో ఉన్న రాష్ట్రాల కూటమి అని పేర్కొంది. తమదేశంలోని 18 రాష్ట్రాలనుంచి సేకరించిన అనధికారిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని, టైర్ 1 దేశాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన గణాంకాలను తీసుకుని, వాటితో పోలుస్తూ భారత్‌లో కోవిడ్ మరణాల సంఖ్యను లెక్కగట్టడం సరికాదని తేల్చిచెప్పింది.
డబ్ల్యూహెచ్‌ఓ లెక్కల్లో వచ్చే ఫలితంపై తమకు ఎటువంటి పట్టింపులు లేవని, అయితే లెక్కగట్టే విధానంపై మాత్రం సందేహాలున్నాయని, ఆ ఫలితంపై ఖచ్చితత్వాన్ని విశ్వసించలేమని పేర్కొంది. తమ అభ్యంతరాలను ప్రపంచ ఆరోగ్యసంస్థకు ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నామని, ఇప్పటివరకు ఆరు లేఖలు రాశామని, లోతైన సాంకేతిక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నామని తెలిపింది. టైర్ 2 దేశాల జాబితాలోని చైనా, ఇరాన్, బంగ్లాదేశ్, సిరియా, ఇథియోపియా, ఈజిప్ట్ కూడా భారత్ మాదిరిగానే గణింపు విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తక్కువ జనాభా, తక్కువ విస్తీర్ణంతో ఉన్న దేశాల గణాంకాలతో పోలుస్తూ విశాలమైన భారత్ లాంటి దేశాలనుంచి తీసుకున్న అనధికారిక సమాచారంతో మరణాల సంఖ్యను ఎలా లెక్కగడతారని టైర్ 2 దేశాలు ప్రశ్నించాయి. ఒక ప్రాంతంలో, ఒకనెలలో సగటు ఉష్ణోగ్రతలు, సగటు మరణాల సంఖ్యను లెక్కగడుతున్నారని, వాస్తవ పరిస్తితులను ఈ విధానం ఎలా నిర్ధారిస్తుందో అర్థం కావడం లేదని పేర్కొంది. ట్యునీషియాలాంటి అతి తక్కువ జనాభా ఉన్న చిన్న దేశాల్లో మరణాల శాతాన్ని భారత్‌లాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలోని మరణాల శాతంతో నిష్పత్తి కట్టడం ఎలా సమర్థించగలమని ప్రశ్నించింది.
ఒకవేళ టైర్ 1 దేశాలలో అనుసరిస్తున్న విధానం సాధికారమైనదే అయితే, టైర్ 2 దేశాలకు ఆ విధానంలోని అంశాలేమిటో చెప్పాలని కోరింది. కరోనా మరణాలపై ద గ్లోబల్ హెల్త్ ఎస్టిమేట్స్ -2019 ప్రకారం మరణాల సంఖ్యపై అంచనా లెక్కగట్టారు. భారత్‌లో భారీసంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయని, మునుముందు మరింత పెరుగుతాయని ఆ నివేదిక పేర్కొంది. దీనిని భారత్ తప్పుబడుతోంది. టైర్ 1 దేశాలలో (కోస్టారికా, ఇస్రాజెయల్, పరాగ్వే, ట్యునీషియా) అధికారిక సమాచారం ఆధారంగా లెక్కగట్టిన ఆ సంస్థ భారత్‌లాంటి టైర్ 2 దేశాల్లో మాత్రం అనధికారిక సమచారంతో లెక్కలు చెబుతోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతుల వయసు,లింగ, ఇతర గణాంక సమాచారం నిర్వహణలో సరైన విధానాన్ని అనుసరిచడం లేదంటూ ఎత్తిచూపడాన్ని భారత్ కొట్టిపారేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..