Friday, November 22, 2024

భారత్‌ ఘనకీర్తి.. పేదరికం నుంచి 41.5 కోట్ల మందికి విముక్తి

పేదరిక నిర్మూలనలో భారత్‌ కనీవినీ ఎరుగని ప్రగతి సాధించిందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) కితాబు ఇచ్చింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచినప్పటికీ గడచిన 15 సంవత్సరాల్లో 41.5 కోట్ల మంది పౌరులకు పేదరికం నుంచి విముక్తిని కల్పించడం ద్వారా చిరస్మరణీయమైన ఘనతను భారత్‌ సాధించిందని ఐరాస మంగళవారం కొనియాడింది. ఈ మేరకు 2005-06 నుంచి 2019-21 మధ్య 15 సంవత్సరాల కాలానికి బహుకోణ పేదరిక సూచీ(ఎంపీఐ) తాజా సమాచారంతో కూడిన నివేదికను ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్‌ పేదరికం, మానవాభివృద్ధి ఇనీషియేటివ్‌(ఓపీహెచ్‌ఐ) ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో సంయుక్తంగా విడుదల చేశాయి.

అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతిని సాధించడం ద్వారా భారత్‌తో పాటుగా కంబోడియా, చైనా, కాంగో, హండురస్‌, ఇండోనేషియా, మొరాకో, సెర్బియా, వియత్నాం లాంటి 25 దేశాలు 15 సంవత్సరాల వ్యవధిలో వాటి భౌగోళిక ఎంపీఐ విలువలను సగానికి సగం తగ్గించుకున్నాయి. 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ చైనాను తోసిరాజందని నివేదిక పేర్కొంది. పేదరిక నిర్మూలన సాధ్యమే అన్న విషయాన్ని తాజా నివేదిక చాటి చెప్పింది. భారత్‌ విషయానికి వస్తే 2005-06లో దాదాపు 64.5 కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతుండగా 2015-16కు వచ్చేసరికి ఆ సంఖ్య దాదాపు 37 కోట్లకు పడిపోయింది.

- Advertisement -

2019-21లో 23 కోట్లకు తగ్గిపోయింది. భారత్‌కు సంబంధించి మిగిలిన పౌష్టికాహార లేమి (44.3 శాతం నుంచి 11.8 శాతానికి), శిశు మరణాలు(4.5 శాతం నుంచి 1.5 శాతానికి) వంట గ్యాస్‌ లేమి(52.9 శాతం నుంచి 13.9 శాతానికి), పారిశుద్ధ్య లేమి(50.4 శాతం నుంచి 11.3 శాతానికి), తాగునీరు లేమి(16.4 శాతం నుంచి 2.7 శాతానికి), విద్యుత్‌ సరఫరా లేమి(29 శాతం నుంచి 2.1 శాతానికి), ఆవాస లేమి(44.9 శాతం నుంచి 13.6 శాతానికి) సూచీల్లోనూ గణనీయమైన తగ్గుదల కనిపించిందని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement