దేశంలో త్వరలో మరో నాలుగు కొత్త కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. రోజుకు కోటి వ్యాక్సిన్ డోసులు అందించవచ్చని, మరికొన్ని వారాల్లో ఇది సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు వారాల్లో రోజుకు 73 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చేలా సన్నద్ధమవ్వాలని, ఈ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.
మొత్తం వ్యాక్సిన్ ఉత్పత్తిలో 25 శాతం రాష్ట్రాలు సేకరిస్తున్నాయని చెప్పారు. దేశీయంగా తయారయ్యే వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రం సేకరిస్తుండగా, ఇందులో 45 ఏళ్లకు పైబడిన వారికి ఇచ్చే వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా రాష్ట్రాలకు అందిస్తోందన్నారు. మిగిలిన 50 శాతం వ్యాక్సిన్లను తయారీదారుల నుంచి రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు నేరుగా కొనుగోలు చేసే వెసులుబాటు ఉందన్నారు. రాష్ట్రాలు సేకరించిన వ్యాక్సిన్లలో అవి ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్‌ను చేపడతాయని వీకే పాల్ పేర్కొన్నారు.