కొలంబో:ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో దేశం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు పొరుగునే ఉన్న భారత్ ఎనలేని సాయం చేసిందని, ఊపిరిలూది ప్రాణం పోసిందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతతో తల్లడిల్లుతున్నవేళ భారత్ అండగా నిలిచిందని అన్నారు. ఆర్థికంగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నవేళ ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని భారత ప్రభుత్వం గొప్పగా ఆదుకుందని, అందువల్లే ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానని, వారికి మా ప్రజలు, ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బుధవారం పార్లమెంట్‌లో తొలి ప్రసంగంలో ఆయన ఈ ప్రత్యేక విధాన ప్రకటన చేయడం విశేషం.
త్వరలో ఇంధన సమస్యకు పరిష్కారం
ట్రింకోమలీలో భారత్‌తో కలసి చమురు రవాణా ట్యాంకుల అభివృద్ధి, ఆయిల్ కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేశామని, దేశంలో ఇంధన కొరత త్వరలో పరిష్కారమవుతుందని, క్యూలలో పౌరులు రోజుల తరబడి బారులు తీరే పరిస్థితి త్వరలోనే ముగిసితుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తతం ఇంధన కొరత ఉన్నప్పటికీ మరీ ఆందోళకర పరిస్థితులు లేవని చెప్పారు. 2016లో తాను ప్రధానిగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఉచితంగా అంబులెన్సులను ఇచ్చిందని, వాటివల్ల వేలాదిమంది ప్రాణాలు కాపాడగలిగామని గుర్తు చేశారు. శ్రీలంక పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లోని 9 ప్రావిన్సులలో మెరుగైన వైద్యం కోసం సువా సెరియా పేరుతో భారత ప్రభుత్వం దాదాపు 300 అంబులెన్సులు, 22.65 మిలియన్ డాలర్ల మొత్తాన్ని గ్రాంటుగా ఇచ్చిన విషయాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. అలీన విదేశాంగ విధానాన్ని అనుసరించడమే శ్రీలంకకు శ్రేయోదాయకమని, అన్ని దేశాలతో సత్సంబంధాలు అభిలషణీయమని ఆయన అభిప్రాయపడ్డారు
.
త్వరలో కొత్త ఆర్థిక విధానం
ప్రస్తుత ఆర్థిక సంక్షోభంనుంచి గట్టెక్కి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి వీలు కల్పించేలా సరికొత్త జాతీయ ఆర్థిక విధానాన్ని రూపొందిస్తున్నామని, పాతికేళ్ల కాలపరిమితితో ఈ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. 2048 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంలో దేశం ఆర్థికంగా పుంజుకోవడమే లక్ష్యంగా ఈ విధానం సిద్ధమవుతోందని చెప్పారు.
జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం.. రండి
జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడాని ప్రయత్నిద్దామని, అందుకు కలసి రావాలని అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు. రుణాలకు సంబంధించిన ప్రణాళికను మార్చి, ఆర్థిక పునరుద్ధరణ దిశగా కొన్ని చర్యలు తీసుకోబోతున్నామని, త్వరలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు. అధ్యక్షుడు రణిల్ పార్లమెంట్‌కు చేరుకోగానే త్రివిధ దళాలు గౌరవవందనం చేశాయి. స్పీకర్ మహింద యాప అబేయవర్ధనే, సెక్రటరీ జనరల్ ఆఫ్ పార్లమెంట్ ధమ్‌ిక దశనాయక అధ్యక్షుడికి స్వాగతం పలికారు.
గొటబాయ సోదరులపై ఆంక్షల కొనసాగింపు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరులలో మాజీ ప్రధాని మహింద రాజపక్సే, మాజీ ఆర్థికమంత్రి బసిల్ రాజపక్సలు దేశం విడిచివెళ్లకుండా విధించిన ఆంక్షలను ఆగస్టు 4వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొనడానికి గొటబాయ కుటుంబమే కారణమని, వారు చేసిన అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ చైర్మన్ ఆఫ్ సిలన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చంద్ర జయరత్నే తదితరులు వేసిన పిటిషన్ విచారణకు రాగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.