న్యూ ఢిల్లీ – రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ ఒత్తిడి చేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. కొవిడ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం యావత్ ప్రపంచంపై పడిందని అన్నారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌కు ప్రధాని ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ చేరుకున్న ఆయనకు త్రివిధ దళాలు గౌరవ వందనం పలికాయి. అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోడీ, షోల్జ్ మాట్లాడారు.
మోడీ మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుదేశాలకు భారత్ సూచిస్తూనే ఉందని అన్నారు. ఎలాంటి శాంతి చర్చలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఉక్రెయిన్ వివాదం మొదలైనప్పటి నుంచి దౌత్యం, చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని భారత్ నొక్కి చెబుతోందని మోడీ పేర్కొన్నారు. కొవిడ్, ఉక్రెయిన్- రష్యా యుద్ధ ప్రభావం యావత్ ప్రపంచం అనుభవించిందని అన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై పోరులో భారత్, జర్మనీల మధ్య పరస్పర సహకారం ఉందన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు గట్టి చర్యలు అవసరమని ఇరు దేశాలు నమ్ముతున్నాయన్నారు. యూరప్‌లో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి జర్మనీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్‌లో పెట్టుబడులకు ముఖ్యమైన వనరు కూడా అని తెలిపారు. అలాగే భారత్, జర్మనీ మధ్య బలమైన సంబంధాలు ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయని,. గత కొన్నేళ్లుగా భారత్, జర్మనీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని మోడీ అన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కారణంగా ప్రపంచం మొత్తం బాధపడుతోందని జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తెలిపారు. హింసతో దేశ సరిహద్దులను ఎవరూ మార్చలేరని ఆయన నొక్కి చెప్పారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం వల్ల అపారమైన నష్టం, విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. ఈ యుద్ధాన్ని ఒక విపత్తుగా అభివర్ణించారు. “భారత్ ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. అది భారత్, జర్మనీ మధ్య సంబంధాలకు చాలా మంచిది. రష్యా దురాక్రమణ పర్యవసానాలతో ప్రపంచం అల్లాడిపోతోంది. దాదాపు 1,800 జర్మన్ కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. అవి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాయి. మాకు ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు కావాలి. సాఫ్ట్వేర్ రంగం భారత్‌లో బాగా అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలు భారత్‌లో ఉన్నాయి. అని పేర్కొన్నారు.