దక్షిణాఫ్రికా పర్యటనను భారత యువ జట్టు ఘన విజయంతో ముగించింది. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన చివరి నాలుగో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో సఫారీలను 135 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి పొట్టి సిరీస్ ను సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా… ఆతిథ్య జట్టు ముందు 284 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా, లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. దీంతో సూర్య సేన 135 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా… అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీశారు. ఇక, హార్దిక్ పాండ్యా, రమణదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును ట్రిస్టన్ స్టబ్స్ (43), డేవిడ్ మిల్లర్ (36), మార్కో జాన్సెన్ (29 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ భారత బౌలర్ల ధాటికి వారు కూడా చేతులెత్తేశారు.
ఇక, అంతకముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా మెరుపు బ్యాటింగ్ తో 283 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. సంజూ శాంసన్ (56 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లు 109 నాటౌట్ ), తిలక్ వర్మ ( 47 బంతుల్లో 10 సిక్స్, 9 ఫోర్లు 120 నాటౌట్ ) సఫారీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ విజృంభించారు. అభిషేక్ శర్మ (36) రాణించాడు.