న్యూఢిల్లి : భారతదేశ అతిపెద్ద డ్రోన్ మహోత్సవం భారత్ డ్రోన్ మహోత్సవ్-2022ను ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉదయం పదిగంటలకు ఢిల్లిలోని ప్రగతి మైదాన్‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కిసాన్ డ్రోన్ పైలెట్లతో ముచ్చటించనున్నారు. ఓపెన్ ఎయిర్ డ్రోన్ ప్రదర్శనను స్వయంగా తిలకించనున్నారు. డ్రోన్ ఎగ్జిబిషన్ సెంటర్లోని స్టార్టప్‌లతో ఆయన ముఖాముఖి సంభాషించనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. భారతదేశంలో జరుగుతున్న ఈ అతిపెద్ద డ్రోన్ మహోత్సవానికి 1600 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఆ ప్రతినిధుల్లో ప్రభుత్వ అధికారులు, విదేశీ దౌత్యవేత్తలు, ఆర్మీ అధికారులు, కేంద్ర ఆర్మీ సాయుధ బలగాల అధికారులు, ప్రభుత్వరంగ నిర్వహణ సంస్థల ప్రతినిధులు, ప్రైవేట్ కంపెనీలు, డ్రోన్ స్టార్టప్స్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ఎగ్జిబిషన్లో సుమారు 70కి పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఈ మహోత్సవ్‌లో డ్రోన్ పైలెట్ సర్టిఫికెట్స్, ప్రొడక్ట్ విడుదల, ప్యానెల్ డిస్కషన్లు, డ్రోన్ ఫ్లయింగ్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మేడిన్ ఇండియా డ్రోన్ ట్యాక్సీను కూడా ప్రదర్శించనున్నట్లు పీఎంఓ ఆ ప్రకటనలో తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..