Thursday, November 21, 2024

పుతిన్‌కు భారతే దిక్కు, రష్యా చమురుపై ఐరోపా పాక్షిక నిషేధం..

ప్రపంచ దేశాల ఆంక్షలతో సతమతమవుతున్న రష్యా భారత్‌పై మరింత ఆధారపడే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రత్యకించి రష్యానుంచి చమురు కొనుగోలుపై ఐరోపా దేశాలు తాత్కాలిక నిషేధం విధించిన నేపథ్యంలో రష్యా భారత్‌, చైనా మార్కెట్‌లవైపు చూస్తోంది. అయితే చైనాతో కొన్ని ఇబ్బందులున్న నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఉక్రెయిన్‌పై సైనికచర్య పేరుతో యుద్ధానికి దిగిన నేపథ్యంలో ప్రపంచదేశాలు ఆంక్షలు విధించినప్పటికీ భారత్‌ తటస్థవైఖరి అవంలబించడం, వాణిజ్య సంబంధాలు కొనసాగించిన నేపథ్యంలో రష్యా భారత్‌పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తోంది. ఐరోపా దేశాలు నిషేధం విధించకముందే ఇతర దేశాలతో పోలిస్తే కారుచౌకగా చమురు సరఫరా చేసిన విషయం తెలిసిందే. తాము ఆంక్షలు విధిస్తే వాటిని నీరుగార్చేలా రష్యాతో చమురు వ్యాపారం కొనసాగించడంపట్ల అమెరికా, బ్రిటన్‌ సహా అనేక దేశాలు అభ్యంతరం వ్యక్తం చేయడం, భారత్‌ బేఖాతరు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరోపా సమాఖ్య రష్యా చమురును కొనుగోలు చేయరాదని నిర్ణయించింది. దీని ఫలితంగా ఏటా 10 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతుల ఆదాయాన్ని క్రెవ్లిున్‌ కోల్పోనున్నది. రష్యా సరఫరా చేసే ఉరల్స్‌ ముడి చమురుకు ఐరోపా దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఆ రకం చమురు ఇతర దేశాల్లో ఇంతవరకు విక్రయించలేదు. ఇప్పుడు ఈయూ నిషేధం నేపథ్యంలో ఆ రకం చమురుకు కొత్త మార్కెట్‌లను ఎంచుకోవాల్సిన పరిస్థితి రష్యాకు ఎదురైంది. ఉరల్‌ ముడి చమురును భారీస్థాయిలో శుద్ధి చేయడం చాలా కష్టం.

అందుకు తగ్గ వ్యవస్థలు శ్రీలంక, ఇండోనేసియా వంటి ఆసియా మార్కెట్లలో లేవు. సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌లా ఉండే జ్వాలాగుణమున్న ఉరల్‌ ముడి చమురును శుద్ధి చేయడం చాలా కష్టం. అత్యున్నత, భద్రమైన సాంకేతిక వ్యవస్థ ఉంటేనే అది సాధ్యం. అలాంటి పరిస్థితులు ఆసియా దేశాల్లో తక్కువ. అందువల్ల ఇప్పుడు రష్యా దృష్టి ప్రధానంగా భారత్‌పైన, ఆ తరువాత చైనాపైన పడింది. భారత్‌లో విస్తృతస్థాయిలో ముడి చమురు శుద్ధి కేంద్రాలున్నాయి. చైనాలో భారత్‌కన్నా విస్తృతమైన వ్యవస్థలు ఉన్నప్పటికీ వాణిజ్యం విషయంలో మనతో ఉన్నంత సానుకూల వాతావరణం లేదు. పైగా కరోనా విజృంభణ నేపథ్యంలో చైనాలో చాలాకాలంగా ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. పోర్టుల్లోవందలాది నౌకలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణం చమురు విక్రయాలు సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ ఒక్కటే రష్యాకు ఆశాకిరణంగా ఉంది. పేరుకుపోతున్న ఉరల్‌ ముడి చమురును భారత్‌కు ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే భారత్‌, చైనా ఇప్పటికే పెద్దమొత్తంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకున్న నేపథ్యంలో ఇంకా పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తాయా అన్నది ప్రశ్న

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement