దేశంలో కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం 44 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా 38 వేలకు పడిపోయాయి. శుక్రవారంతో పోలిస్తే ఇది 13 శాతం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 38,628 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,18,95,385కు చేరింది. ఇందులో 4,12,153 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,10,55,861 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 4,27,371 మంది మహమ్మారి వల్ల మరణించారు.
మరోవైపు శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 40,017 మంది బాధితులు కోలుకోగా, 617 మంది మృతిచెందారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు 2.21 శాతంగా తెలిపింది. గత 12 రోజులుగా ఇది 3 శాతం లోపే ఉంటుందని పేర్కొన్నది. కాగా, ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. దేశంలో మొత్తం 50,10,09,609 డోసులు పంపిణీ చేశారు. ఇందులో గత 24 గంటల్లో 49,55,138 మందికి టీకా పంపిణీ చేశామని తెలిపింది. కాగా కరోనా వ్యాక్సినేషన్ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పొందినవారి సంఖ్య 50 కోట్లు దాటింది.
ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ