Saturday, November 23, 2024

భారత్‌ బౌలర్లు బెదిరిపోరు – ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ పీటర్సన్‌

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో 3-0తో నెగ్గిన ఇంగ్లండ్‌ జట్టు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ వారిని చూసి భారత్‌ బెదిరిపోదని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డారు. జులై 1వ తేదీన ఇరు జట్ల మధ్య ఎడ్గ్‌బాస్టన్‌ (బర్మింగ్‌హామ్‌)లో రీషెడ్యూల్‌ చేసిన ఐదవ టెస్ట్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో పీటర్సన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కొద్దినెలలుగా ఇంగ్లండ్‌ మంచి ఫామ్‌ను కనబరుస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి న్యూజిలాండ్‌ టూర్‌లో అద్భుత విజయాలు నమోదు చేసింది. సంప్రదాయ ఆటశైలికి విరుద్ధంగా ఎదురుదాడి వ్యూహాన్ని అనుసరిస్తూ వచ్చిన ఇంగ్లండ్‌ మంచి ఫలితాలు సాధించింది.

భారత్‌తోనూ అదే విదంగా ఆడతామని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇప్పటికే ప్రకటించాడు. న్యూజిలాండ్‌ టూర్‌లో రాణించిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ భారత బౌలింగ్‌ను తేలిగ్గా ఎదుర్కొంటారని కొందరు ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తుండగా భారత్‌కు మద్దతు తెలుపుతూ పీటర్సన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. న్యూజిలాండ్‌ జట్టులో స్టార్‌ బౌలర్లు లేకపోవడంవల్ల ఇంగ్లండ్‌ రాణించిందని, అయితే భారత జట్టులో బౌలర్లను తక్కువ అంచనా వేయడానికి లేదని హెచ్చరించారు.

బౌలింగ్‌, బ్యాటింగ్‌ లైనప్‌లో బలిష్టంగా ఉన్న భారత జట్టును ఎదుర్కోవడం అంత సులువు కాదని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌ స్టో సగటు స్ట్రైక్‌ రేట్‌ 100కు పైగానే ఉంది. అంతమాత్రాన భారత బౌలర్లు వీరిని చూసి కంగారుపడిపోతారను అనుకుంటే పొరబడినట్టేనని పీటర్సన్‌ అన్నారు. అందువల్ల భారత్‌తో ఇంగ్లండ్‌ జట్టు గట్టి పోటీని ఎదుర్కోకక తప్పదని అభిప్రాయపడ్డాడు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement