కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ బయోటెక్ కంపెనీ మరో అడుగు ముందుకు వేసింది. సంస్థ తయారు చేసిన చుక్కల మందు బూస్టర్ డోస్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఈ ట్రయల్స్ 900 మందిపై నిర్వహించేందుకు నిర్ణయించారు. ఒమిక్రాన్ దేశ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్నది. ఈ సమయంలో బూస్టర్ డోస్ ఎంతో కీలకంగా మారింది. ఫేజ్-3 బూస్టర్ డోసులో భాగంగా ఈ చుక్కల మందు టీకాకు డీసీజీఐ నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చుక్కల మందు రూపంలో అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. ఫేజ్-3 బూస్టర్ డోస్ కోసం దరఖాస్తు చేసుకున్న రెండో కంపెనీగా భారత్ బయోటెక్ నిలిచింది. ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్ కింద ఈ చుక్కల మందు అనువైందని భారత్ బయోటెక్ పేర్కొంది.
ఒమిక్రాన్ కేసులు ఎంతో వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. చుక్కల టీకా పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ.. భారత్ బయోటెక్.. మూడు వారాల క్రితం దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుత అవసరాల దృష్ట్యా.. సాధ్యమైనంత త్వరగా చుక్కల మందు టీకాపై ట్రయల్స్ నిర్వహించి.. టీకాలను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ఆలోచిస్తున్నది. రెండు డోసుల టీకా తీసుకున్న వారికి తాము అభివృద్ధి చేసిన ఇంట్రానాజల్ టీకా బూస్టర్ డోసుగా ఎంతో అనువైందని కంపెనీ తెలిపింది. ముక్కు ద్వారా ఈ చుక్కలు వేస్తారు. శరీరంలోకి వైరస్ ప్రవేశించే మార్గంలోనే దాన్ని అడ్డుకోవచ్చని.. దీంతో వైరస్ బారినపడకుండా కాపాడుకోవడమే కాకుండా.. ఇన్‌ఫెక్షన్, వ్యాప్తి నుంచి పూర్తి రక్షణ పొందొచ్చని కంపెనీ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..