Monday, November 18, 2024

గోధుమల ఎగుమతిపై భారత్‌ నిషేధం.. పునరాలోచించాలన్న జీ-7 దేశాలు..

న్యూఢిల్లి : ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆహార సంక్షోభం తలెత్తే అవకాశాలు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో గోధుమల ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించడం సరైంది కాదని జర్మనీ వ్యవసాయ శాఖ మంత్రి సెమ్‌ జెడ్మిర్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలకు భారత్‌ అన్నం పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. గోధుమల ఎగుమతిపై విధించిన నిషేధిత అంశాన్ని మరోసారి పునరాలోచించాలని జీ”7 దేశాల ప్రతినిధులు భారత్‌కు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై జీ-7 దేశాల విదేశాంగ మంత్రులు మూడు రోజులపాటు చర్చలు జరిపారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ప్రపంచ ఆహార భద్రత, ఇంధన భద్రత, రష్యాకు చైనా మద్దతు, నార్త్‌ కొరియా క్షిపణి ప్రయోగాలు, భారత్‌లో వడగాలులు వంటి అంశాలు చర్చకొచ్చాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ సంక్షోభానికి దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఆహార ధాన్యాల దిగుమతి అత్యల్ప స్థాయికి పడిపోయిందని, దీంతో ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాలు ఎగుమతుల్లేక ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో తీవ్ర ఆహార కొరత ఏర్పడనుందని జీ-7 దేశాల ప్రతినిధులు హెచ్చరించారు.

ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం..

ప్రపంచమంతా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారత్‌ గోధుమల ఎగుమతిపై నిషేధం విధించడం తగదని, ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుందని జర్మనీ వ్యవసాయ శాఖ మంత్రి సెమ్‌ జెడ్మిర్‌ అభిప్రాయపడ్డారు. గోధుమ ఉత్పత్తుల్లో అగ్ర స్థానంలో ఉన్న ఉక్రెయిన్‌.. ప్రస్తుతం యుద్ధం కారణంగా ఉత్పత్తి తగ్గిందన్నారు. ప్రపంచ ఆహార సరఫరాలో అంతరాయానికి రష్యానే కారణమని మండిపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం ఏర్పడితే.. రష్యానే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతీ దేశం తమ ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధించుకుంటూ పోతే.. ఇతర దేశాల్లో ఆకలి చావులు తప్పవన్నారు. జీ20 సభ్య దేశంగా ప్రపంచానికి ఆహారం అందించే బాధ్యత భారత్‌ తీసుకోవాలని, గోధుమల ఎగుమతిపై విధించిన నిషేధం ఎత్తేయాలని సూచించారు. భారత్‌ పొరుగున్న దేశాలు నేపాల్‌, బంగ్లాదేశ్‌లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందన్నారు. తరలో జర్మనీలో జీ-7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ ప్రధాని మోడీని ఆహానిస్తామన్నారు. మోడీతో కూడా గోధుమల ఎగుమతి అంశంపై చర్చిస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement