భారత్ – ఆస్ట్రేలియా మూడో టీ-20 మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం ఆథిత్యం ఇవ్వనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రేక్షకులు తరలి రానున్నారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఉప్పల్ స్టేడియానికి వెళ్లే రహదారులపై భారీ వాహనాలతో పాటు ఇతర వెహికల్స్‌ను అనుమతించమని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
క్రికెట్ అభిమానులు వాహనాలు తీసుకొని వస్తే వచ్చే దారిలో సూచించిన పార్కింగ్ స్థలాల్లోకి వెళ్లి వాహనాలను నిలిపే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక మ్యాచ్ చూడటానికి తార్నాక మీదుగా వచ్చే వీఐపీ వాహనాలు హబ్సీగూడ, ఎన్జీఆర్ఐ, ఏక్ మినార్ వద్ద కుడి వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకొని వాహనాలను ఏ, సీల వద్ద నిలపాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
అంబర్‌పేట వైపు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు దూరదర్శన్, రామాంతపూర్, స్ట్రీట్ నెంబర్ 8 వద్ద ఎడమ వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్ద దిగి వాహనాలను పార్కింగ్ ఏ, సీల వద్ద నిలపాలి.
నాగోల్, వరంగల్ హైవే నుంచి వచ్చే వీఐపీ వాహనాలు ఉప్పల్ చౌరస్తా, సర్వే ఆఫ్ ఇండియా, ఏక్ మినార్ వద్ద ఎడమ వైపు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకోవాలని పోలీసులు తెలిపారు.