న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రపంచ దేశాల్లో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) రంగంపై పెడుతున్న పెట్టుబడుల్లో భారత్ అట్టడగున ఉందని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అన్నారు. నీతి అయోగ్ నివేదికే ఇందుకు నిదర్శనమని తెలిపారు. భారత్‌లో ఆర్ అండ్ డిపై పెట్టుబడులు జీడీపీలో కేవలం 0.7 శాతమే ఉన్నాయని, ప్రపంచ దేశాలలో సగటున ఇది 1.8 శాతం ఉందని ఆయన అన్నారు.
అయితే పరిశోధన, అభివృద్ధి రంగంలో సమూలమైన మార్పులు తలపెడుతూ తీసుకువచ్చిన ఈ నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ బిల్లు పురోగమన చర్యగా భావిస్తున్నందున ఈ బిల్లును తమ పార్టీ స్వాగతిస్తోందని అన్నారు. ఆర్ అండ్ డిని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఒక నిధిని ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. అయితే ఈ నిధి దుర్వినియోగం కాకుండా, దానికి బాధ్యులను నిర్ధారిస్తూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రికి సూచించారి.
అలాగే కార్పొరేట్లు, ప్రైవేట్ రంగ సంస్థలు పరిశోధన సంస్థలకు నిధులు సమకూర్చి తమ స్వప్రయోజనాల కోసం, సొంత ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నాలు చేసిన ఘటనల నేపధ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు చేపట్టాలి. నిష్పక్షపాతంగా పరిశోధన, అభివృద్ధి రంగం ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ (స్టెమ్) రంగంలో మహిళల పాత్ర నామమాత్రంగా ఉందని అన్నారు.
దేశంలోని 23 ఐఐటీలలో 20 శాతం సీట్లలో మాత్రమే మహిళలు ఉన్నారు. ఐఐటి ఫ్యాకల్టీలో కేవలం 11 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. స్టెమ్ కోర్సులలో 52 శాతం మహిళలు ప్రవేశం పొందుతుంటే వారిలో వృత్తిలో అడుగుపెడుతున్నది మాత్రం కేవలం 29 శాతం మాత్రమే అని దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి పరిశోధన రంగంలో మహిళల భాగస్వామ్యానికి కృషి చేయాలని ఆయన కోరారు.