ఇండియా కూటమి ముఖ్య నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆప్, ఆర్జేడీ, శివసేన-యూబీటీ, ఎన్సీపీ-శరద్ పవార్ వర్గానికి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ తరఫున రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఆప్ తరఫున ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ పాల్గొన్నారు. డీఎంకే తరఫున టీఆర్ బాలు ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ భేటీకి టీఎంసీ, పీడీపీ నేతలు హాజరుకావటం లేదని ఇంతకు ముందే సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏడోవిడత పోలింగ్ కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేనని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో హాజరుకావటం లేదని మెహబూబా ముఫ్తీ తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున ఏ విధమైన వ్యూహం అనుసరించాలనే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు.