ముంబై – ప్రతిపక్షాల I.N.D.I.A. కూటమి నేటి సమావేశంలో 13 మంది సభ్యులతో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. సెప్టెంబర్ 30లోపు సీట్ల సర్దుబాటుపై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కోఆర్డినేషన్ ప్యానెల్ సభ్యులుగా కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), సంజయ్ రౌత్ (శివసేన యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), రాఘవ్ చద్దా (ఆమ్ ఆద్మీ పార్టీ), జావెద్ అలీ ఖాన్ (ఎస్పీ) లల్న్ సింగ్ (జేడీయూ), హేమంత్ సోరెన్ (జేఎంఎం), డీ రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనలిస్ట్ కాంగ్రెస్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) ఉన్నారు.
కాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ కూటమి కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కూటమి తీర్మానం చేసింది. ‘I.N.D.I.A. కూటమి పార్టీలమైన మేం, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వీలైనంత వరకు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. వివిధ రాష్ట్రాలలో సీట్ల భాగస్వామ్యం ప్రయత్నాలు తక్షణమే ప్రారంభమవుతాయి. సీట్ల పంపకాల్లో ఇచ్చిపుచ్చుకోవడంతో సహకార స్ఫూర్తితో వీలైనంత త్వరగా ముగిస్తాము’ అని తీర్మానం చేశాయి. ఇక ఈసారి ఈ మీటింగ్ ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత, పస్తుత ఎస్పీ ఎంపి కపిల్ సిబాల్ హాజరుకావడం విశేషం…