Wednesday, October 2, 2024

IND vs ZIM | కుప్ప‌కూలిన జింబాబ్వే.. టీమిండియా ఘ‌న విజ‌యం

జింబాబ్వేతో జరుగతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా… జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేస్తూ… 234 పరుగులు బాదింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన జింబాబ్వేకు తమవంతుగా భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో జింబాబ్వే జట్టు 18.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది.

జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ వెస్లీ మాధేవేరే (43), ల్యూక్ జోంగ్వే (33), బ్రియాన్ బెన్నెట్ (26) రెండెంక‌ల ప‌రుగులు సాధించగ‌లిగారు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో ముఖేష్ కుమార్, ముఖేష్ కుమార్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు. రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయ‌గా 2.. వాషింగ్టన్ సుందర్ ఒక్క వికెట్ ద‌క్కించుకున్నాడు.

- Advertisement -

టీమిండియా కుర్రాళ్లు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. రెండో టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకు పడ్డారు. అభిషేక్ శర్మ(47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100) శతక్కొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్ క్లాస్ ఇన్నింగ్స్ తో (47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 77 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్ (22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ తీసారు.

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. రోహిత్ రికార్డ్ బద్దలు!

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా తొలి శతకం నమోదు చేసిన మొదటి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్‌లతో సెంచరీ సాధించాడు.

ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ.. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌటయ్యాడు. కానీ రెండో మ్యాచ్‌లోనే శతకం నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే శతకం బాదిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో దీపక్ హుడా, కేఎల్ రాహుల్‌లను అభిషేక్ శర్మ అధిగమించాడు.

మూడు ఇన్నింగ్స్‌ల వ్యవధిలో దీపక్ హుడా శతకం బాదగా.. నాలుగు ఇన్నింగ్స్ వ్యవధిలో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా కూడా అభిషేక్ శర్మ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో 38 బంతుల్లో సెంచరీతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్ యాదవ్(45), కేఎల్ రాహుల్(46), అభిషేక్ శర్మ(46) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఈ మ్యాచ్‌లో 8 సిక్స్‌లు బాదిన అభిషేక్ శర్మ.. ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు.

ఈ ఏడాది 18 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 50 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ 25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 25 మ్యాచ్‌లే ఆడిన విరాట్ కోహ్లీ 45 సిక్స్‌లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. శివమ్ దూబే(41), రియాన్ పరాగ్(33), రిషభ్ పంత్(31) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement