టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్‌గా చరిత్రకెక్కాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇది రోహిత్ శర్మకు భారత ఓపెనర్‌గా 121వ 50 ప్లస్ స్కోర్. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ భారత ఓపెనర్‌గా 120 సార్లు 50 ప్లస్ రన్స్ చేశాడు.
అత్యధిక సిక్సర్లు..
గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వన్డే క్రికెట్‌లో తొలి 10 ఓవర్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు హిట్ మ్యాన్ 53 సిక్సర్లు బాదగా.. 24 సిక్సర్లతో డేవిడ్ వార్నర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మహమ్మద్ వసీమ్(22), మిచెల్ మార్ష్(17), క్వింటన్ డికాక్(15) ఈ జాబితాలో ఉన్నారు.
వన్డే క్రికెట్‌లో తొలి 10 ఓవర్లలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్లలో రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 7 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. 4 హాఫ్ సెంచరీలతో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. సచిన్, రాబిన్ ఊతప్ప, గౌతమ్ గంభీర్ ఒక్కో హాఫ్ సెంచరీతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ద్రవిడ్‌ను అధిగమించిన హిట్ మ్యాన్..
అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ.. దిగ్గజ బ్యాటర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్(10768)ను అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డుకు 4 పరుగుల దూరంలో ఉన్న రోహిత్.. వెల్లాలాగే వేసిన నాలుగో ఓవర్‌లో బౌండరీ బాది ద్రవిడ్‌ను అధిగమించాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (18,426) అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ(13,872), సౌరవ్ గంగూలీ(11,221).. రోహిత్ శర్మ కన్నా ముందున్నారు. వన్డే క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ అత్యధిక భాగస్వామ్యం యావరేజ్ కలిగిన జోడీగా కూడా రికార్డ్ సాధించాడు.