Home క్రీడాప్రభ IND vs AUS | పోరాడుతున్న భారత్..

IND vs AUS | పోరాడుతున్న భారత్..

0
IND vs AUS | పోరాడుతున్న భారత్..

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్ లో భార‌త జట్టు పోరాడుతొంది. 157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. రెండో రోజు ఆట ముగిసేస‌రికి 128/5 ప‌రుగులు చేసింది. ఇంకా 29 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది.

కాగా, టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట‌ర్లు యశస్వి జైస్వాల్ (24), కేఎల్ రాహుల్ (7), విరాట్ కోహ్లీ (11), శుభ్‌మన్ గిల్ (28) నిరాశపరిచ‌గా…. కెప్టెన్ రోహిత్ శర్మ (6) మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు.

అయితే, ఈ ఇన్నింగ్స్‌లో భార‌త వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ వచ్చి రావడంతోనే అటాకింగ్ గేమ్‌తో ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కీలకమైన విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. ఎలాంటి బెరుకు లేకుండా తొలి బంతినే బౌండరీకి తరలించాడు.

మరో ఎండ్‌లో గిల్ ఔటైనా.. క్రీజులోకి వచ్చిన రోహిత్ తడబడినా.. పంత్ మాత్రం స్వేచ్చగా బౌండరీలు బాదుతున్నాడు. ప్ర‌స్తుతం క్రీజ్ లో రిష‌బ్ పంత్ (25 బంతుల్లో 28 ప‌రుగులు నాటౌట్), నితిష్ కుమార్ రెడ్డి (14 బంతుల్లో15 నాటౌట్) ఉన్నారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో పాట్ కమిన్స్ (2/33), స్కాట్ బోలాండ్ (2/39) రెండేసి వికెట్లు తీయ‌గా.. మిచెల్ స్టార్క్ (1/49) ఒక్క వికెట్ ప‌డగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు కుప్పకూలింది.

ఆసీస్ 337 ఆలౌట్..

ఈ మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించింది. అద్భుతమైన బ్యాటింగ్‌, బౌలింగ్ తో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. 86/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ 87.3 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 140) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్ (126 బంతుల్లో 9 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో రాణించాడు.

భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ (4/98), జస్‌ప్రీత్ బుమ్రా (4/61) నాలుగేసి వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

ఓవ‌ర్ వ్యూ :

భార‌త్ తొలి ఇన్నింగ్స్ 44.1 ఓవర్లలో 180 (ఆలౌట్)
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 87.3 ఓవర్లలో 337 (ఆలౌట్) లీడ్ 157

భార‌త్ రెండో ఒన్నింగ్స్ 24 ఓవర్లలో (128/5) 29 పరుగుల వెనుకంజలో ఉంది.

Exit mobile version