Monday, November 25, 2024

IND vs AUS | ఆరంభ పోరులో రికార్డులో మోత !

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని భార‌త జట్టు ఘ‌నంగా ఆరంభించింది. ఆల్‌రౌండ్ షోతో కంగారూలను కంగారు పెట్టింది.. 295 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యం సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన సిరీస్‌లో దుమ్ము రేపింది.

ఈ టెస్టులో భార‌త జ‌ట్టు 295 ప‌రుగ‌ల తేడాతో విజ‌యం సాధించి.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో ముందంజలో ఉంది.

- Advertisement -

పెర్త్‌లో కోహ్లీ సెంచరీ.. ప్రపంచంలోనే ఫస్ట్ క్రికెటర్ గా

రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ… ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు (7) సాధించిన భారత ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. ఇక ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఇండియన్ బ్యాటర్స్ లిస్టులో కోహ్లీ ఫస్ట్ ప్లేస్‌కి చేరుకున్నాడు.

అంతేకాక టెస్టుల్లో విరాట్‌కి ఇది 30వ సెంచరీ కాగా… అంతర్జాతీయంగా మొత్తం 81వ శతకం. ఇక ఆస్ట్రేలియాలో ఓవరాల్‌గా ఇది 10వ సెంచరీ.. దీంతో ఆస్ట్రేలియాలో మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 10 సెంచరీలు సాధించిన మొదటి క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు.  

జైస్వాల్ రికార్డులే రికార్డులు..

తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్​ అయిన జైస్వాల్, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 205 బంతుల్లో సెంచరీ బాదేశాడు. అయితే తన కెరీర్‌లో ఇది నాలుగో శతకం కావడం విశేషం. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన లిస్ట్​లో యశస్వి ఐదో బ్యాటర్​గా రికార్డుకెక్కాడు. ఇక ఈ ఏడాది యశస్వి 3 శతకాలు బాదాడు. అయితే అందరికంటే సునీల్ గావస్కర్ (1971లో 4 సెంచరీలు) సాధించాడు.

ఆసీస్‌పై సెంచరీ చేసిన రెండో యంగెస్ట్‌ ఓపెనర్‌గా యశస్వి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో ఆడిన తొలి టెస్టులో సెంచరీ చేసిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. అతను మొదటి 15 టెస్టుల్లో 1500+ పరుగులు సాధించిన తొలి ఆసియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

అరంగేట్ర మ్యాచ్ లో తెలుగోడి స‌త్తా..

నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రంలోనే తన ఆల్ రౌండ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 59 బంతుల్లో 41 పరుగులు చేసి టాప్ స్కోర్ గా నిలిచాడు. భారత జట్టు 150 పరుగులు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా భారత బ్యాట‌ర్లు ఎవరూ 40 పరుగుల మార్కును దాటలేకపోయారు.

నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులతో ఆకట్టుకుని రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. అతను 8వ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఏడవ భారత అరంగేట్ర ఆటగాడిగా నిలిచాడు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ టీ20 ఫార్మాట్‌లో బ్యాటింగ్ చేస్తూ.. 27 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేశాడు. తన ఆరాధ్య క్రికెటర్ కోహ్లీతో కలిసి 54 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై బంతితో విరుచుకుపడ్డాడు. ప్రమాదకరంగా మారుతున్న మిచెల్ మార్ష్ ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. నితీష్‌కి టెస్టు కెరీర్‌లో ఇదే తొలి వికెట్‌. దీంతో ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా చాటుతున్నాడ‌ని.. అరంగేట్రంలో అదరగొట్టాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

దిగ్గ‌జాల స‌ర‌స‌న బూమ్రా

ఇక‌ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టిన భారత కెప్టెన్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా గడ్డపై అతను 8 మ్యాచ్లోనే 40 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. కపిల్ దేవ్ 11 టెస్టుల్లో 51 వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే (49), రవిచంద్రన్ అశ్విన్ (39) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇక సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై అత్యధిక సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్​గా కపిల్ దేవ్ సరసన బుమ్రా నిలిచాడు. అలాగే వినూ మన్కడ్ (1), బిషన్ బేడీ (8), కపిల్ దేవ్ (4), అనిల్ కుంబ్లే (2) తర్వాత టెస్టుల్లో ఐదు వికెట్లు తీసిన ఐదో భారత కెప్టెన్​గా బుమ్రా నిలిచాడు. 2007లో మెల్​బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో కుంబ్లే (5/84) ఈ ఘనత సాధించిన చివరి భారత కెప్టెన్. మళ్లీ ఆ పాంచ్ పటాకాను కెప్టెన్​గా బుమ్రా అందుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ సూపర్ విక్టరీ సాధించడంతో పలు రికార్డులు నమోదయ్యాయి.

టెస్టుల్లో అత్యుత్త బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్లు

10/135 – కపిల్ దేవ్ వెస్టిండీస్, (అహ్మదాబాద్ 1983)
10/194 – బిషన్ సింగ్ ఆస్ట్రేలియా (పెర్త్లో, వాకా స్టేడియం, 1977)
9/70 – బిషన్ సింగ్ బేడీ న్యూజిలాండ్ (చెన్నై-1976)
8/72 జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియా (పెర్త్లో, ఆప్షన్ స్టేడియం 2024)
8/109 – కపిల్ దేవ్ vs ఆస్ట్రేలియా (అడిలైడ్, 1985)

ఆస్ట్రేలియాపై భార‌త్ అతిపెద్ద విజ‌యాలు (పరుగుల ప‌రంగా)

320 – మొహాలీ 2008
295 – పెర్త్ 2024
222 – మెల్బోర్న్ 1977
179 – చెన్నై 1998
172 – నాగ్ పూర్ 2008

ఆసియా వెలుపల భారత్ కు అతిపెద్ద విజయాలు (పరుగుల పరంగా)

318 – వెస్టిండీస్‌పై(నార్త్ సౌండ్, 2019)
295 – ఆస్ట్రేలియాపై (పెర్త్, ఆప్షన్ స్టేడియం, 2024)
279 – ఇంగ్లాండ్ మీద (హెడింగ్లీ, 1986)
272 – న్యూజిలాండ్‌పై (ఆక్లాండ్, 1968)
257 – వెస్టిండీస్‌పై (కింగ్స్టన్, 2019)

మ్యాచ్ రివ్యూ….

పెర్త్‌ వేదికగా జ‌రిగిన తొలి టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా ఈ స్కోరును సులభంగా దాటి పెద్ద స్కోరు చేస్తుందని అందరూ భావించ‌గా.. ఆసీస్ కూడా వరుస వికెట్లు కోల్పోయి 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.

అయితే, తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో పరుగుల వరద పారించారు. సెంచరీల మోత మోగింస్తూ.. భారీ స్కోర్ న‌మోదు చేశారు. యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ (161 పరుగులు) రెండో ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు.

అతనికి తోడుగా కేఎల్ రాహుల్ (77 పరుగులు) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (100* నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ తో మెరుపు సెంచరీ న‌మోదు చేశాడు. దీంతో భారత్ 487 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం, రెండో ఇన్నింగ్స్ స్కోరుతో భారత జట్టు ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల దాడిని తట్టుకోలేక ఆస్ట్రేలియా స్టార్ ప్టేయ‌ర్లు పెవిలియన్ బాటపట్టారు.

ట్రావిస్ హెడ్ (89; 101 బంతుల్లో, 8 ఫోర్లు), మిచెల్ మార్ష్ (47; 67 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), అలెక్స్ కేరీ (36; 58 బంతుల్లో, 2 ఫోర్లు) పోరాడారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో విజృంభించారు. వాషింగ్టన్ సుందర్ రెండు, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా ఒక్క వికెట్ పడగొట్టారు.

దీంతో కంగారు టీమ్ రెండో ఇన్నింగ్స్ ను 238 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ గ్రాండ్ విక్టరీతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మెన్ ఇన్ బ్లూ తిరిగి టాప్‌లోకి దూసుకెళ్లింది. ఇక భారత్–ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబర్ 06న రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. 10వ తేదీ వరకు జరగనుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement