Saturday, November 23, 2024

పెరుగుతున్న జనరిక్‌ ఔషధాల అమ్మకాలు.. 2023లో 10 వేలకు పెరగనున్న షాపులు

దేశంలో క్రమంగా జనరిక్‌ ఔషధాల అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) స్కీమ్‌ కింద దేశంలో జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో జన ఔషధి కేంద్రాల అమ్మకాలు 1,236 కోట్లుగా నమోదయ్యాయి. క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే అమ్మకాలు 38 శాతం పెరిగాయి. ఈ స్కీమ్‌లో జనరిక్‌ మెడిసిన్స్‌ అమ్మకాలు ఐదు సంవత్సరాల్లో 775 కోట్లుగా నిర్ణయించారు. లక్ష్యాన్ని మించి అమ్మకాలు జరిగినట్లు ఫార్మాసూటికల్స్‌ అండ్‌ మెడికల్‌ డివైస్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియా (పీఎంబీఐ) సీఈఓ రవి దధీచ్‌ చెప్పారు. పీఎంబీఐ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ మంత్రిత్వ శాఖ కింద ఉంటుది. గత రెండు సంవత్సరాలుగా తీసుకున్న పలు చర్యల మూలంగా అమ్మకాలు పెరుగుతున్నాయని చెప్పారు.

ప్రధానంగా జనరిక్‌ మెడికల్‌ షాపులు జన ఔషధి కేంద్రాలను భారీగా పెంచినట్లు తెలిపారు. అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచడం, ప్రధాన మంత్రితో పాటు మంత్రులు కూడా దీనిపై ప్రజల్లో బాగా ప్రచారం చేయడం కూడా అమ్మకాలు పెరిగేందుకు తోడ్పడిందని తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో 9,300 జన ఔషధి కేంద్రాలను ప్రారంభించారు. ఈ మెడికల్‌ షాపుల్లో అమ్మకానికి 1,800 రకాల లైఫ్‌ సేవింగ్‌ మెడిసిన్స్‌ను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు 285 రకాల సర్జికల్స్‌, న్యూట్రాస్యూటికల్స్‌, వైద్య పరికరాలను విక్రయిస్తున్నారు. జన ఔషధి మెడికల్‌ షాపుల్లో ముందులన్నీ బ్రాండెడ్‌ మందులతో పోల్చుకుంటే 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు లభిస్తున్నాయి. మెడికల్‌ షాపులను చిన్న వ్యాపారులే నడిపిస్తున్నారు. టెండర్ల ద్వారా మందులను సేకరిస్తున్న పీఎంబీఐ వాటిని ఈ షాపులకు సరఫరా చేస్తోంది.

- Advertisement -

2023-24 ఆర్ధిక సంవత్సరంలో జనరిక్‌ మెడికల్‌ షాపుల సంఖ్యను 10 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు రవి దధీచ్‌ చెప్పారు. ప్రభుత్వం 651 జిల్లాల నుంచి ఈ మెడికల్‌ షాపుల ఏర్పాటుకు అప్లికేషన్లను ఆహ్వానించింది. దేశంలో పేషంట్లకు అవసరమైన మందులకు తక్కువ ధరలకే అందించేందుకు ప్రభుత్వం జనరిక్‌ మెడికల్‌ షాపులను ప్రారంభించింది. ఆరోగ్యం రంగంలో జరుగుతున్న ఖర్చులో అంటే చికిత్స, ఆసుపత్రి ఖర్చులు, మెడిసిన్స్‌ చూస్తే, ఇందులో ఒక్క మెడిసిన్స్‌ కోసమే 63 శాతం ఖర్చువుతున్నదని ప్రభుత్వం తెలిపింది. మన దేశంలో అమ్ముతున్న మందుల్లో 95 శాతం జనరిక్‌ మెడిసిన్స్‌నే. ఇందులో 90 శాతం మెడిసిన్స్‌ బ్రాండెడ్‌ జనరిక్స్‌గా పిలుసున్నారు. ఈ మందులను తయారు చేస్తున్న కంపెనీలు మార్కెట్‌లో భారీ ప్రచారంతో, మెడికల్‌ రిప్స్‌తో డాక్టర్లను సంప్రదిస్తూ ఆ మందులనే రాసేలా ప్రోత్సహిస్తూ భారీగా వ్యాపారం చేస్తున్నాయి. వీటి ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి.

మిగిలిన 10 శాతం ట్రేడ్‌ జనరిక్స్‌గా ఉన్నాయి. ఈ మందుల అమ్మకాలకు ఎలాంటి మార్కెటింగ్‌ ప్రచారం లేదు. బ్రాండెడ్‌ జనరిక్స్‌తో పోల్చితే అందుకే ఈ మందులకు ధరలు చాలా తక్కువగా ఉంటాయి. జనరిక్‌ మెడిసిన్స్‌ నాణ్యతపై, వాటి సామర్ధ్యంపై తరచుగా కొన్ని వర్గాలు ప్రశ్నలను లెవనెత్తుతునే ఉంటున్నాయి. ఇవి నాణ్యత తక్కువ అని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని రవి దధీచ్‌ స్పష్టం చేశారు. విదేశాలకు సైతం మెడిసిన్స్‌ను ఎగుమతి చేస్తున్న కొన్ని టాప్‌ కంపెనీలు జన ఔషధికి మెడిసిన్స్‌ను సరఫరా చేస్తున్నాయని చెప్పారు.

జనరిక్‌ మెడిసిన్స్‌ను ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాల ప్రకారం తయారు చేస్తున్న కంపెనీల నుంచే సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటించే కంపెనీల నుంచి తాము కొనుగోలు చేసి జనరిక్‌ మెడికల్‌ షాపులకు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్స్‌లో పరీక్షించి సరైన ప్రమాణాలు లేని మెడిసిన్స్‌ బ్యాచ్‌లను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. వైద్య ఖర్చులు తగ్గించుకునేందుకు గణనీయంగా ఉపయోగపడుతున్న జనరిక్‌ మెడిసిన్స్‌ను రోగులు నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చని ఆయన చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement