హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇప్పటికే సాగు వ్యయం పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు మరో చేదువార్త. అంతర్జాతీయ విపణిలో ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎరువుల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువులు, వాటి ముడి సరుకుల ధరలు పెరుగుతుండడంతో తప్పక ఎరువుల ధరలను పెంచాల్సిన పరిస్థితులు క్రమంగా స్పష్టమవుతున్నాయి.
ధరలు పెరిగిన నేపథ్యంలో రానున్న త్రైమాసికానికి ఎరువుల ధరలు పెంచి రైతుల మీద భారం మోపడమా..? లేక ఎరువుల సబ్సీడీ మొత్తాన్ని పెంచడమా..? అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవేళ ఎరువుల స బ్సీడీని కేంద్ర ప్రభుత్వం పెంచేందుకు సుముఖంగా లేనిపక్షంలో ఎరువుల ధరలు పెరిగి ఆ భారాన్ని రైతులు మోయాల్సి ఉంటుందని వ్యవసాయ, మార్కెట్‌రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఎరువుల ధరలు పెరిగేందుకు ధరలు పెరగడానికి రష్యా – ఉక్రెయిన్ యుద్దంతోపాటు అనేక కారణాలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభం వరకు టన్ను యూరియా చేసుకుంటే భారతదేశం రూ.318 నుంచి రూ.320 డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు యూరియా టన్ను ధర 395 డాలర్ల నుంచి 410డాలర్లకు పెరిగింది. అదే సమయంలో డై అమ్మోనియం పాస్పేట్ (డీఏపీ) టన్ను ధర 435 డాలర్ల నుంచి 400 డాలర్ల మధ్యన ఉండగా ఇప్పుడు అది టన్నుకు రూ.560 డాలర్లకు పెరిగింది.
అదే విధంగా డీఏపీ తయారీలో కీలకమైన ముడిపదార్థమైన అమ్మోనియా ధరలు కూడా టన్నకు 300 డాలర్ల నుంచి 400, 405 డాలర్లకు పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఎరువుల దిగుమతిధరలు టన్నుకు డీఏపీ ధర టన్నుకు రూ.1000దాకా చేరింది. అమ్మోనియా దిగుమతి ధర టన్నుకు 1575 డాలర్లు, ఫాస్పరిక్ యాసిడ్ ధర టన్నకు 1715 డాలర్లకు పెరిగింది. డీఏపీ, యూరియా తయారీలకు రాక్ ఫాస్ఫేట్ ప్రధాన ముడి పదార్థం. దీని కోసం భారతదేశం 90 శాతం ఎగుమతులపై ఆధారపడి ఉంది.
అంతర్జాతీయ ధరలలో హెచ్చుతగ్గులు భారతదేశ దేశీయ ధరలను నేరుగా ప్రభావితం చేయడానికి ఇది ప్రధానమైన కారణంగా నిలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ వివాదం కారణంగా తలెత్తిన సమస్య కారణంగా భారత్ ఇతర ఎరువుల దిగుమతి ఎంపికలను పరిశీలిస్తోంది. భారతదేశంలో ఎరువులు సబ్సిడీపై అందజేస్తోంది. ఎరువులకు అయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరగడంతో సబ్సిడీ భారం రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవలి సంవత్సరాలలో ఎరువుల సబ్సిడీ రూ.80,000 నుండి రూ.90,000 కోట్ల వరకు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎరువులపై సబ్సిడీ సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలకు పెరగవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ వంటి ఎరువులను సరసమైన ధరలకు అందించడమే ప్రభుత్వాలు ప్రాధాన్యతగా పెట్టు-కున్నాయి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ సంక్షౌభం కాకుండా, ఇరాన్‌పై అమెరికా విధించిన కఠినమైన ఆంక్షలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.
అయితే ఈలోగా ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులపై ఆర్థికభారం పెరగకుండా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎరువులను సిద్ధం చేసింది. తద్వారా ఖరీఫ్‌కు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నా అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు కొనసాగితే యాసంగి సీజన్‌కు ఎరువుల ధరలు పె రిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే యూరియా డీఏపీ కొరత లేకుండా , ధరలు పెంచకుండా రైతులకు అందుబాటులో ఉంచితేనే గిట్టు-బాటు- ధర లభిస్తుందని వ్యవసాయరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
యూరియా, డైఅమ్మోనియం ఫాస్ఫేట్ , మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అమెరికా, బ్రెజిల్, పాకిస్తాన్, చైనా తదితలర దేశాల్లో చాలా ఖరీదైన ధరలకు అమ్ముడవుతున్నాయి. భారతదేశంలో ఒక్కో బస్తాకు 50 కిలోల యూరియా ధర రైతులకు 266.70 పైసలుగా ఉంది. పాకిస్థాన్‌లో రైతులకు 50 కిలోల యూరియా బస్తా ధర రూ.791. ఇండోనేషియాలో అదే బరువున్న యూరియా బస్తా రూ.593 చొప్పున విక్రయిస్తుండగా, బంగ్లాదేశ్‌లో అదే బస్తా ధర రూ.719గా ఉంది.
చైనాలో 50 కిలోల యూరియా ధర భారతదేశంలో కంటే దాదాపు ఎనిమిది రెట్లు- ఎక్కువ. యూరియా భారత్‌లో కంటే బ్రెజిల్‌లో 13.5 రెట్లు- ఎక్కువగా అమ్ముడవుతోంది. బ్రెజిల్‌లో 50 కిలోల యూరియా ధర రూ.3600. అదే సమయంలో అమెరికాలో దీని ధర బస్తాకు రూ.3060. చైనాలో ఒక్కో బస్తాకు రూ.2100 చొప్పున రైతులకు యూరియా లభిస్తోంది.