హైదరాబాద్, ఆంధ్రప్రభ : వయస్సు, ఆరోగ్యం, జాతితో సంబంధం లేకుండా ప్రజలంతా అవయవదానానికి ముందుకు రావాలని జీవన్‌దాన్ పిలుపునిచ్చింది. తమను తాము అవయవ, కణజాల దాతలుగా (టిష్యూ)మార్చుకోవాలని సూచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏటికేడాది అవయవదానం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తమ వారు చనిపోయారన్న పుట్టెడు దుంఖంలోనూ వారి కుటుంబ సభ్యులు అవయవదానం చేస్తూ ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్నారు. ఏటా ఆగస్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా తెలంగాణలో జరిగిన అవయవదానం వివరాలను జీవన్‌దాన్ ఫౌండేషన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో 2013లో 41 , 2014లో 51, 2015లో 89, 2016లో106, 2017లో 150, 2018లో 160, 2019లో 134, 2020లో 75, 2021లో 162, 2022లో ఇప్పటి వరకు 124 మంది దాతలు తాము చనిపోతూ తమ అవయవాలను దానం చేసి ఎంతో మంది ప్రాణాలను నిలిపారు. రాష్ట్రంలో 2013 నుంచి ఇప్పటి వరకు 4151 అవయవాలను దాతలను స్వీకరించి అంతిమఘడియల్లో ఉన్న రోగులకు అమర్చి ప్రాణదానం చేశారు. ఇందులో కిడ్నీలు 1651, లివర్ 1013, గుండె 154, గుండె నాళాలు 170, ఊపిరితిత్తులు 172లను దాతల నుంచి సేకరించి అవసరమైన రోగులకు అమర్చారు. 2022లో జరిగిన 476 అవయవాదానాల్లో కిడ్నీలు 171, కాలేయం 11, గుండె 16, ఊపిరితిత్తులు 46 మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు.
మరణించినా చావుబతుకుల్లో ఉన్న పలువురికి ప్రాణాదానం చేయడం ఒక్క అవయవాదానం ద్వారా మాత్రమే సాధ్యమని జీవన్‌దాన్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ స్వర్ణలత స్పష్టం చేస్తున్నారు. నవజాత శిశువులు మొదలుకుని 90ఏళ్లలోపు వారు కూడా అవయవదానం చేయొచ్చని ఆమె చెబుతున్నారు. ప్రమాదాల్లో మరణించిన వారో, బ్రెయిన్ డెడ్ అయిన వారే కాకుండా అనారోగ్యంతో మరణించిన వారి అవయవాలను కూడా దానం చేయొచ్చని చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.