అమరావతి, ఆంద్రప్రభ : తక్కువ ఖర్చు, జీరో పొల్యూషన్ నినాదం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఈనేపథ్యంలోనే ఈవీ ఛార్జింగ్‌ఒ స్టేషన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం దేశంలోని దాదాపు 9 వేల పెట్రోల్ పంపులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ సౌకర్యాలను అందిస్తున్నాయి. ది ఎకనామిక్ -టైమ్స్ అధికారిక గణాంకాల ప్రకారం ఎలక్ట్రిక్ ఛార్జింగ్ సౌకర్యాలను అందించే ఇంధన స్టేషన్ల సంఖ్య 2022లో 3,423 ఉంటే ఈఏడాది జూన్ ప్రారంభం నాటికి ఆ సంఖ్య 8,853కి చేరింది. దేశంలోని మొత్తం పెట్రోల్ పంపుల్లో ఈ సంఖ్య దాదాపు 10 శాతంగా పెరుగదల నమోదైంది.
దేశంలో అతిపెద్ద పెట్రోల్ పంప్ ఆపరేటర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 36,400 అవుట్‌లెట్‌లలో దాదాపు 5,600 బంక్‌లలో ఈవీ ఛార్జింగ్ సౌకర్యాలను అందించడంలో ముందుంది. అంటే మొత్తంలో 15 శాతం వాటా కలిగి ఉంది. రెండవ అతిపెద్ద ఆపరేటర్ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) 2,100 పంపుల వద్ద ఛార్జింగ్ సౌకర్యాలను కలిగి ఉంది, ఇక బీపీసీఎల్ 738 పంపుల వద్ద ఈవీ ఛార్జింగ్‌ను అందిస్తోంది. మరోవైపు, రిలయన్స్-బీపీ, నయారా ఎనర్జీ మరియు షెల్‌తో సహా ప్రైవేట్ ఇంధన రిటైలర్లు కూడా చిన్న స్థాయిలో అయినప్పటికీ గ్రీన్ ఎనర్జీకి మారడం ప్రారంభించారు. రిలయన్స్-బీపీ1,586 పంపులలో 28 పంపులవద్ద ఈవీ ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉండగా, నయారా ఎనర్జీ 6,388 పంపులలో 178 పంపులవద్ద ఈవీ ఛార్జింగ్ సేవలను అందిస్తోంది.
ఇక షెల్ 343 పంపులలో 201 పంపుల వద్ద ఈసేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తంగా, ప్రైవేట్ రిటైలర్లు దేశవ్యాప్తంగా 407 పంపుల వద్ద ఈవీ ఛార్జింగ్ సదుపాయాలను అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్ మరియు బీపీసీఎల్ వంటి చమురు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యులు) రాబోయే సంవత్సరాల్లో మొత్తం 22 వేల పంపులకు ఈవీ ఛార్జింగ్ సౌకర్యాలను విస్తరించాలని యోచిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్ 2024 నాటికి 10 వేల పంపుల్లో సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా, హెచ్‌పీసీఎల్ 2025 నాటికి 5 వేల ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది.
ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు పెరుగుతున్న డిమాండ్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర, దేశ వ్యాప్తంగా టూ వీలర్ల రంగంలో మంచి అమ్మకాలను నమోదు చేస్తున్న క్రమంలో తామేమీ తక్కువ కాదన్నట్లుగా కార్లు, బస్సులు కూడా పెద్ద ఎత్తున వినియోగంలోకి వస్తున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం జరుగుతోంది. ఇక కార్ల సంఖ్య వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈనేపథ్యంలో దేశంలో ప్రస్తుతం ఉన్న ఈవీ వాహనాల సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం డిమాండ్ కూడా పెరుగుతోంది.
నగరాలు, రహదారుల వెంట ఏర్పాటు
ప్రస్తుతం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా, తాజాగా పెట్రోల్ పంపుల వద్ద కూడా వీటిని ఏర్పాటు చేయడంతో ఈ వాహనాల ద్వారా ప్రయాణం చేసే వారిలో ఆందోళన తగ్గుముఖం పడుతోంది. ఎక్కువ మంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలకు మారేలా ఇది అవకాశం కల్పిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింతగా పెంచేందుకు అన్ని పెట్రొలియం సంస్ధలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.