అమరావతి, ఆంధ్రప్రభ: ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో నర్సింగ్ కోర్సులకు డిమాండ్ పెరిగింది. వైద్య ఆరోగ్య రంగంలో జీరో వెకెన్సీ పాలసీని ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఠక్కున ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. జర్మనీలో నర్సుల శిక్షణ మరియు ప్లేస్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇది వరంగా మారింది.. ఫ్యామిలీ డాక్టర్ల కాన్సెప్ట్, కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటుతో నర్సింగ్ పోస్టులకు డిమాండ్ పెరిగింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య ఆరోగ్యశాఖలో మున్నెన్నడూ లేని విధంగా అన్నిస్థాయిలో 53 వేల పోస్టుల్ని భర్తీ చేసింది. ఇందులో వైద్యులతో పాటు నర్సుల పోస్టుల్ని కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసింది. ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలో నర్సులది కీలకపాత్ర. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకువస్తున్న వైసీపీ సర్కార్ నర్సింగ్ కళాశాలల అభివృద్ధిపై దృష్టిసారించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు బీఎస్సీ నర్సింగ్ కళాశాలల్లో 8,030 సీట్లు ఉన్నాయి.
అయితే ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో 1090 సీట్లు మాత్రమే ఉండటంతో మరో 18 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆ సంఖ్యనుపెంచేలా ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలలు ఏర్పాటైతే అందులో 1,200 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా ప్రభుత్వ కళాశాలల్లో నర్సింగ్ సీట్ల సంఖ్య 2,290కు చేరనుంది.
ఇక్కడి నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో విస్తృతంగా అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్య రంగంలో నో వెకెన్సీ పాలసీని సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు నర్సింగ్ పోస్టులు భర్తీ అవుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రభుత్వాస్పత్రుల్లో నర్సుల పోస్టుల్లో వేకెన్సీ 27 శాతం ఉంటే… ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జీరో.
ఏపీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో ప్లేస్‌మెంట్స్
నర్సింగ్ వృత్తిలో విదేశీ ప్లేస్‌మెంట్స్ కోసం అంతర్జాతీయ ఏజెన్సీలతో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎంఓయూలు కుదుర్చుకుంటుంది. జర్మనీలో నర్సుల శిక్షణ మరియు ప్లేస్‌మెంట్‌ను ప్రారంభించడానికి. ఇండోయూరో సింక్రినైజేషన్ (ఏఈఎస్) ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. నర్సింగ్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్‌లోని నర్సింగ్ కాలేజీలలో 3 నోడల్ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నైపుణ్యమైన శిక్షణ అందించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 10 క్లస్టర్‌లను ఏర్పాటు- చేయాలని యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. జర్మన్ సంస్కృతి వైపు విద్యార్థుల మొత్తం హ్యాండ్‌హోల్డింగ్ మరియు గ్రూమింగ్ కాల్మరోయ్ అని పిలువబడే ఏఈఎస్ ఎంప్యానెల్డ్ సంస్థ ద్వారా అందిస్తున్నారు. జర్మనీలో నర్సింగ్ వృత్తిలో పనిచేసేందుకు రాష్ట్రం నుంచి 78 మంది నర్సులకు మార్గం సుగమమైంది.
బీ1 స్థాయి జర్మన్ భాషా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వీరు జర్మనీకి చేరుకున్న తర్వాత, బీ 2 నైపుణ్యం కోసం 6 నెలల భాషా శిక్షణ పొందనున్నారు. ఆ తరువాత వారికి వారికి జర్మనీలోని వివిధ ఆసుపత్రులలో ప్లేస్‌మెంట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నర్సుల కోసం జర్మన్ భాషా శిక్షణా కార్యక్రమాన్ని జూలై నెలలో చేపట్టామన్నారు.
ఓవర్సీస్ మ్యాన్‌పవన్ కంపెనీ(ఏపీ) టెక్టె ఇంటర్నేషనల్ (యుకె) జర్మనీకి చెందిన ఆక్సిలా అకాడమీ మొత్తం 150 మందికి నర్సుల దరఖాస్తుల్ని పరిశీలించి వారిలో 78 మందిని ఎంపిక చేసింది. జర్మనీ వంటి దేశం కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా శిక్షణ పొందిన మొదటి బ్యాచ్ ను తయారు చేసింది. జర్మనీ భాషా శిక్షణా కార్యక్రమాన్ని ఇంత తక్కువ వ్యవధిలో ఉన్నత వృత్తి ప్రమాణాలతో పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ గుర్తింపు దక్కించుకుంది.
నర్సింగ్ విద్యలో మార్పులు
నర్సింగ్ విద్యలో కౌన్సిల్ అనేక మార్పులు చేసింది. వైద్యరంగంలో వస్తున్న ఆధునీకరణ నేపథ్యంలో సిలబస్‌లో సవరణ చేసింది. బీఎస్సీ నర్సింగ్ విద్యలో ఇప్పుడు సెమిస్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. అలాగే డాక్టర్ ఆఫ్ నర్సింగ్, ఈ లెర్నింగ్ కోర్సుల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫౌండేషన్, కేర్, ఎలక్టివ్ కోర్సులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ కోర్సులో పేషెంట్ సెంటర్డ్ కేర్ తీసుకువచ్చింది.
ఇందులో రోగి వ్యక్తిగత ప్రాధాన్యతలు అవసరాలను గుర్తించి పూర్తిస్థాయిలో సేవలు అందించాల్స ఉంటుంది. హెల్త్ కేర్ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని నర్సింగ్ కౌన్సిల్ సూచిస్తోంది. రోగి విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. వ్యక్తిగత పనితీరుతో రోగికి ఎలాంటి ప్రమాదం కలగకుండా వ్యవహరించాలి. స్కిల్ ల్యాబ్, క్లినికల్ లెర్నింగ్ ప్రాధాన్యతలు పెరుగుతున్నాయి.