Saturday, November 23, 2024

Big Story | ఈ బస్సులకు పెరుగుతున్న డిమాండ్‌.. కంపెనీల‌కు భారీగా ఆర్డ‌ర్లు

దేశంలో క్రమంగా విద్యుత్‌ వాహనాల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా టూ వీలర్లు, కార్లు ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నాయి. వీటితో పాటు విద్యుత్‌ ఆటోల అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో విద్యుత్‌ బస్సులను సేకరించి రాష్ట్రాలకు అందించాలని నిర్ణయించింది. ఇలా భారీగా విద్యుత్‌ బస్సులు తయారీకి భారీ ఎత్తున నిధులు అవసరం అవుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

కంపెనీలకు భారీగా ఆర్డర్లు…

ప్రస్తుతం జేబీఎం ఆటో కంపెనీ వద్ద 5,000 విద్యుత్‌ బస్సుల సరఫరా ఆర్డర్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు ఇచ్చినవే ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేట్‌ ఆపరేటర్లు కూడా విద్యుత్‌ బస్సుల కొనుగోలు ఆర్డర్లు ఇస్తున్నారు. టాటా మోటార్స్‌కు 2,600 విద్యుత్‌ బస్సుల ఆర్డర్లు ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే 900 బస్సులను డెలివరీ చేసింది. పీఎంఐ కంపెనీ ఇప్పటికే 1200 విద్యుత్‌ బస్సులను డెలివరీ చేసింది. చేతిలో మరో 2,500 బస్సులకు ఆర్డర్లు ఉన్నాయి. స్వచ్‌ మొబిలిటీకి 1,000 బస్సుల ఆర్డర్లు ఉన్నాయి. ఈకేఈ మొబిలిటీ అండ్‌ పిన్నాకిల్‌ సం స్థకు 500 బస్సుల ఆర్డర్లు ఉన్నాయి.

- Advertisement -

సబ్సిడీలతో ఊతం…

2017లో దేశంలో మొదటి విద్యుత్‌ బస్సును హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో ప్రారంభించారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఇక్కడ విద్యుత్‌ బస్సులను నడిపించారు. ఒక బస్సుతో ప్రారంభించి మొత్తం 25 విద్యుత్‌ బస్సులను నడిపించారు. ఇవి ఏసీ బస్సులు కావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలోని వివిధ నగరాల్లో 5,000 విద్యుత్‌ బస్సులు నడుస్తున్నాయి. ఇతర బస్సులతో పోల్చితే విద్యుత్‌ బస్సుల ఖరీదు చాలా ఎక్కువగా ఉంది. కర్బన్‌ ఉద్గారాలను తగ్గించడం, డీజిల్‌, పెట్రోల్‌ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం విద్యుత్‌ బస్సులకు రాయితీలు ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2015లో ఫేమ్‌ సబ్సిడీ స్కీమ్‌ను ప్రకటించిన తరువాత దేశంలో విద్యుత్‌ వాహనాల ఉత్పత్తికి ఊతం వచ్చింది.

ప్రస్తుతం దేశంలోని ఫరిదాబాద్‌, ధర్వాడ్‌, లక్నో, ఇన్నోరి, పుణే, హైదరాబాద్‌లో ఉన్న వివిధ కంపెనీలు సంవత్సరానికి 40,000 విద్యుత్‌ బస్సులను తయారు చేసే సామర్ధ్యం కలిగి ఉన్నాయి. గత వారం కేంద్ర ప్రభుత్వం వివిధ నగరాలకు ఇచ్చేందుకు 10వేల విద్యుత్‌ బస్సులను సమీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు నిధులు సమకూర్చనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆర్డర్లు పెరుగుతున్నందున వచ్చే 5 సంవత్సరాల్లో విద్యుత్‌ బస్సుల తయారీ పరిశ్రమ 8 -10 రెట్లు వృద్ధి నమోదు చేసుకునే అవకాశం ఉందని అంచనా. విద్యుత్‌ బస్సులను భారీగా ఉత్పత్తి చేసేందుకు కంపెనీలకు భారీగా పెట్టుబడులు అవసరం అవుతాయి.

కేంద్ర ప్రభుత్వం 2022-2027 నాటికి మొత్తం 50వేల విద్యుత్‌ బస్సులను నేషనల్‌ ఎలక్ట్రిక్‌ బస్సు ప్రోగ్రామ్‌ (ఎన్‌ఈబీపీ)కింద రాష్ట్రాలకు సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకు భారీగా నిధులు కూడా అవసరం అవుతాయి. 9 మీటర్ల విద్యుత్‌ బస్సు ఖరీదు 90 లక్షల నుంచి కోటీ రూపాయల వరకు ఉంది. ఇది సాధారణ డీజిల్‌ బస్సు కంటే మూడు రెట్లు ఎక్కువ ఖరీదైనది. కేంద్రం పీఎం ఇ-బస్సు సేవా స్కీమ్‌ కింద 169 పట్టణాలకు 10వేల విద్యుత్‌ బస్సులను సరఫరా చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ స్కీమ్‌తో ఆటో ఇండస్ట్రీ అందుకు అనుగుణంగా సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌లో గ్లోబల్‌ ట్రాన్స్‌పోర్టు సలహాదారుగా పని చేసిన ఓపీ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కూడిన ఈ స్కీమ్‌ వల్ల దీని పనితీరు మెరుగ్గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం..

ప్రభుత్వం ఫేమ్‌-2 సబ్సిడీలతో పాటు గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జీసీసీ) మోడల్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో ప్రైవేట్‌ సంస్థలు విద్యుత్‌ బస్సులను, ఛార్జింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ను కొనుగోలు చేసి, వాటి నిర్వాహణ బాధ్యతలు తీసుకోవచ్చు. ఇలా విద్యుత్‌ బస్సులు కొనుగోలు చేసి స్టేట్‌ ఆర్టీసీలకు అద్దె ప్రాతిపదికన ఇవ్వొచ్చు. ఇలా వీటిని 12 సంవత్సరాల పాటు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చారు. దీని వల్ల భారీ పెట్టుబడులతో ఆర్టీసీలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆర్ధిక భారం పడకుండా చూడవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే విద్యుత్‌ బస్సుల కొనుగోలుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఆర్టీసీలు నిధులు సమకూర్చడం మేలని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు.

విద్యుత్‌ బస్సుల కొనుగోలులో ప్రభుత్వం జీసీసీ మోడల్‌లో కొనుగోలు చేయడం కాని, వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) ద్వారా కాని చేయవచ్చని అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీకి చెందిన స్విచ్‌ మొబిలిటి సీఈఓ మహేష్‌ బాబు అభిప్రాయపడ్డారు. 169 పట్టణాలకు ఇచ్చే 10వేల బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం 57,613 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో కేంద్రం 20వేల కోట్లు మాత్రమే సమకూర్చనుంది. ఇందులో బస్సుల కొనుగోలుతో పాటు ఛార్జింగ్‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

2022-23 ఆర్ధిక సంవత్సరంలో దేశంలో 1,919 విద్యుత్‌ బస్సుల విక్రయాలు జరిగాయి. ఎలక్ట్రిక్‌ బస్సుల అమ్మకాల్లో పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటి 31.5 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తరువాత హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ 23.1 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. స్విచ్‌ మొబిలిటి 19.8 శాతం, జేబీఎం ఆటో 11.8 శాతం, టాటా మోటార్స్‌ 6.9 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement