Saturday, November 23, 2024

ఆటోమెటిక్‌ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ : కియా వైస్‌ ప్రెసిడెంట్‌..

హైదరాబాద్‌ : దేశంలో ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్లకు డిమాండ్‌ పెరుగుతోందని కియా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ హెడ్‌ హరిదీప్‌ సింగ్‌ బార్‌ తెలిపారు. ప్రస్తుతం కియా అమ్మకాల్లో అన్ని విభాగాలు కలిపి 33 శాతం ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్లు ఉన్నాయని వెల్లడించారు. కస్టమర్లకు మంచి డ్రైవింగ్‌ అనుభవాన్ని ఈ కార్లు ఇస్తాయన్నారు. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి ఐదు కార్లలో ఒకటి ఆటోమెటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ టెక్నాలజీతో వస్తున్నాయని చెప్పారు. పది సంవత్సరాల క్రితం పరిస్థితి ఇలా లేదన్నారు. అప్పుడు మొత్తం కార్ల అమ్మకాల్లో వీటి సంఖ్య రెండు, మూడు శాతానికి మించిలేదన్నారు. మారుతున్న కస్టమర్ల అభిరుచులు, ఆదాయాలు పెరగడం, ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడం వంటి కారణాలతో ఆటో ట్రాన్స్‌మిషన్‌ కార్లకు డిమాండ్‌ పెరుగుతుందన్నారు. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారు ట్రాఫిక్‌, ఇరుకు రోడ్లు, వాహనాల సంఖ్య అధికంగా ఉండటం వంటి కారణాల వల్ల డ్రైవింగ్‌ చేయడం అలసటతో కూడుకుని ఉందని, దీని వల్ల ఎక్కువ మంది కస్టమర్లు ఆటో ట్రాన్స్‌మిషన్‌ కార్లను కొనుగోలు చేస్తున్నారని హరిదీప్‌ సింగ్‌ బార్‌ అభిప్రాయపడ్డారు.

గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా మాన్యూవల్‌ కార్లను ఇష్టపడుతున్నారని చెప్పారు. కియా ఇండియా ఉత్పత్తి చేస్తున్న అన్ని మోడల్‌ కార్లలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. కస్టమర్లకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. కంపెనీ నాలుగు ఆటోమెటిక్‌ గేర్‌ బాక్స్‌లతో కార్లను తయారు చేస్తుందన్నారు. ఇవి 6ఏటీ, 8ఏటీ, ఐవిటీ, 7డీసీటీ ఆటోమెటిక్‌ గేర్‌లు కలిగి ఉంటాయన్నారు. కియా అమ్ముతున్న సోనెట్‌, కార్నెస్‌ కార్లలో 7 స్పీడ్‌ డీసీటి, 6 స్పీడ్‌ ఏటీ గేర్‌ బాక్స్‌లు ఉన్నాయని, వీటికి అదనంగా ఐవీటి టెక్నాలజీని అందిస్తున్నామని చెప్పారు. సెల్టాస్‌లో మల్టిdపుల్‌ ఇంజన్‌ ఛాయిస్‌ ఉందని తెలిపారు. ఎస్‌యూవి అయిన కార్నివాల్‌లో 8 స్పీడ్‌ ఏటీ టెక్నాలజీతో అందిస్తున్నట్లు చెప్పారు. కార్నివాల్‌ కార్లు పూర్తిగా ఆటో ట్రాన్స్‌మెషన్‌తోనే వస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీ అమ్ముతున్న వాటిలో సెల్టాస్‌ బ్రాండ్‌లో ప్రతి మూడు కార్లలో ఒకటి, సోనెట్‌ బ్రాండ్‌లో ప్రతి ఐదు కార్లకు ఒకటి, కార్నెస్‌ బ్రాండ్‌లో ప్రతి మూడు కార్లలో ఒకటి ఆటో టాన్స్‌మిషన్‌ కలిగి ఉన్నాయని ఆయన వివరించారు. 2021 సంవత్సరం కంపెనీ 1,81,583 కార్లను అమ్మింది. 2022లో ఇప్పటి వరకు 1,21,807 కార్లు అమ్మకాలు జరిగాయని ఆయన తెలిపారు. మోడల్స్‌ వారిగా నెలకు సరాసరిన 20 వేల కార్ల అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement