Saturday, November 23, 2024

ఇస్రో సరికొత్త ప్రయోగాలు.. అంతరిక్షంలో హెవీ ట్రాఫిక్​ క్లియర్​ చేసే దిశగా దృష్టి

అంతరిక్షంలో రద్దీ పెరుగుతుందా..? ప్రపంచదేశాలు ప్రయోగించిన ఉపగ్రహ వ్యర్ధాలతో రాకెట్‌ ప్రయాణ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తబోతున్నాయా..? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికిప్పుడు ట్రాఫిక్‌ జామ్‌ కాకపోయినా భవిష్యత్తులో ఉపగ్రహ వ్యర్ధాలు అంతరిక్షంలో అలాగే ఉంటే ప్రయోగం సమయంలో రాకెట్లకు ట్రాఫిక్‌ సమస్య ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు ఇతర దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కూడా చర్చిస్తున్నారు. భవిష్యత్తులో ఆ తరహా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వ్యర్ధాలను తొలగించే ప్రయోగాలకు ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నారు. 2030 సంవత్సరంలోపు అంతరిక్షంలో ఎవరికి వారే సొంత ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని అగ్రదేశాలు పోటీపడుతున్నాయి. ఇదే సందర్భంలో వ్యర్ధాలను తొలగించే ఉపగ్రహాన్ని కూడా రూపొందించాలని, ఆ దిశగా సన్నాహాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతరిక్ష ప్రయోగ రంగంలో అగ్ర దేశాలతో పోటీపడుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తూనే జీవితకాలం పూర్తి చేసుకున్న శాటిలైట్లను అంతరిక్షం నుంచి తొలగించేందుకు అవసరమైన ప్రయోగాల వైపు కూడా ఆలోచన చేస్తున్నది.

ఇదే తరహా ప్రయోగాలకు చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్‌, ఇజ్రాయిల్‌, ఇరాన్‌, దక్షిణకొరియా, ఉత్తరకొరియా వంటి దేశాలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఈ ప్రక్రియలో ప్రపంచ దేశాలు పోటీపడబోతున్నాయి. ఇప్పటివరకు ఇస్రోతో పాటు ప్రపంచంలోని మరో 10 దేశాలు సుమారు 3 వేలకు పైగా ఉపగ్రహాలను తమ తమ దేశాల నుంచి అంతరిక్షంలోకి పంపాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇప్పటివరకు భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన(షార్‌) నుంచి సుమారు 500కు పైగా ఉపగ్రహాలను క్షేమంగా అంతరిక్షంలోకి పంపింది. వాటిలో 381 ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఉండగా, 120 స్వదేశానికి చెందిన శాటిలైట్లు ఉన్నాయి. వాటిలో 80 నుంచి 90 శాతం శాటిలైట్లకు జీవితకాలం ముగిసింది. ఇదే తరహాలో మరికొన్ని దేశాలు 3 వేలకు పైగా శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాయి. వాటిలో కూడా 90 శాతం వరకు లైఫ్‌ పూర్తయిన ఉపగ్రహాలే ఉన్నాయి. ప్రస్తుత వాటివల్ల అంతరిక్షంలో రద్దీ పెరుగుతుంది. ప్రయోగ సమయంలో రాకెట్‌లకు శాటిలైట్ల వ్యర్ధాలు అడ్డుపడే అవకాశాలు రాబోతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆ వ్యర్ధాలను తొలగించే ప్రయోగాలను చేపట్టాలని ఆ దిశగా ఇస్రోతో పాటు ఇతర దేశాలు ఆలోచన చేస్తున్నాయి.

కక్ష్యలోనే తిరుగుతున్న 3 వేలకు పైగా ఉపగ్రహాలు

ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు అంతరిక్ష ప్రయోగ రంగంలో దూసుకుపోతున్నాయి. ప్రధానంగా 11 దేశాలు తరచుగా తమ తమ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన ఉపగ్రహాలను ఆయా దేశాలకు చెందిన రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్నారు. ముఖ్యంగా భారత్‌తో పాటు చైనా, రష్యా, ఇజ్రాయిల్‌ వంటి దేశాలు ఒక ప్రయోగంలోనే 10 నుంచి 20కు పైగా ఉప గ్రహాలను కక్ష్యలోకి పంపుతున్నాయి. ఇప్పటికే 3 వేలకు పైగా శానిలైట్లు అంతరిక్షంలో ఉన్నాయి. వాటిలో 2500కు పైగా శాటిలైట్లకు జీవితకాలం ముగిసింది.

- Advertisement -

అంతరిక్షంలో సొంత కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు

అంతరిక్షంలో సొంత ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని ఇస్రో యోచిస్తున్నది. ఈ తరహా ఆలోచనకు ఇప్పటికే ఆమెరికా, చైనాలు నడుం బిగించాయి. రానున్న దశాబ్ద కాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పోటీపడుతున్నాయి. అందులో భారత్‌ కూడా దూకుడుగా ముందుకు సాగుతుంది. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. ఇందుకోసం ఇస్రో ఒక ప్రణాళికను కూడా అందించింది. అత్యంత సామర్ధ్యం కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లగలిగే సత్తా ఉన్న రాకెట్లను తయారు చేయాలని పరిశ్రమకు ప్రతిపాదించింది. ప్రస్తుతం ఆ తరహా రాకెట్‌ రూపకల్పనపై అంతరిక్ష సంస్థ పరిశోధన చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement