హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటి ఉష్ణోగ్రతలూ పడిపోతున్నాయి. రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
తూర్పు, ఆగ్నేయం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని, దీంతో తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుందని పేర్కొంది. చలి భయంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. తీవ్రమైన చలితోపాటు చలిగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చలి పెరిగిన నేపథ్యంలో గుండెజబ్బులున్న వారు, మధుమేహం, హైబీపీ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
వృద్ధులు, చిన్నారులు బయటకు రావద్దని అధికారులు సూచించారు.చలి ప్రభావం వల్ల గొంతులో ఇన్పెక్షన్లు, జలుబు వ్యాధులు వస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారని బయటకు రావద్దని వైద్యులు కోరారు.
గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 13.2 డిగ్రీలు, భద్రాచలంలో 20 డిగ్రీలు, హకీంపేటలో 15.9, దుండిగల్‌లో 17.9, హన్మకొండలో 15 డిగ్రీలు, హైదరాబాద్‌లో 16.2 డిగ్రీలు, మెదక్‌లో 14.8 డిగ్రీలు, నల్గొండలో 17.4, నిజామాబాద్‌లో 18.1 డిగ్రీలు, రామగుండంలో 15.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.