Wednesday, November 20, 2024

రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవ్రత.. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పడిపోయిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లని గాలులతో రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పల్లె, పట్టణాల్లో పొద్దుపోయే వరకు చలి వీడడం లేదు. మధ్యాహ్నం ఎండ కాస్తున్నా వణుకుపుడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు బయటకు రావాలంటే జనం గజ గజ వణికిపోతున్నారు. వేకువజామున రహదారులపై మంచుకురుస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీల మేర తగ్గనున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాల్లో చలిగాలు మరంత పెరగనున్నాయని హెచ్చరించింది. ఈ శాన్య దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 10.5 డిగ్రీలు, మెదక్‌లో 12.4 డిగ్రీలు, రామగుండం 14.8 డిగ్రీలు, హకీంపేట, నల్గొండ, హన్మకొండలో 15.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement