ప్రభన్యూస్, హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో ఉష్ణోగ్రతలు తగ్గి.. చలి క్రమంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రత గరిష్ణంగా 30.4, రాత్రివేళ కనిష్టంగా 15.1 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో హైదరాబాద్ సిటీలో రోజు రోజుకు చలి తీవ్రమవుతోంది. మరోవైపు ఉదయం పూట సూర్యుడు సైతం కన్పించకపోవడంతో చలి ఎక్కువగా ఉంటోంది. దీంతో ఉదయం నడకకు వెళ్లే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత వారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బంగ్లాదేశ్ వైపుగా వెళ్లి టికోనా దీవి వద్ద తీరాన్ని దాటింది. దీంతో ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిత్రంగ్ తుఫాను దక్షిణ రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో చలి తీవ్రత పెరిగిందని తెలుస్తోంది. రానున్నరోజుల్లో పగటి ఉష్ణోగ్రతలుపెరిగి..రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసింది.